తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు, జీవో జారీ
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ తక్షణమే అమల్లోకి వస్తుందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. దీంతో, ఏపీపీఎస్సీ కూడా విడిపోయినట్లైంది. ఈ ఉత్తర్వులను శుక్రవారం సాయంత్రం జారీ చేసింది. ఇక నుండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే నియామకాలు జరుగుతాయి.
కేసీఆర్‌పై రావెల ధ్వజం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ బాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు పైన కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదన్నారు. స్థానికత విషయంలో తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని రావెల చెప్పారు. తెలంగాణలో స్థానికత పైన అడ్వోకేట్ జనరల్‌తో మాట్లాడుతున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాంతీయ తీవ్రవాదాన్ని రెచ్చగొడుతోందన్నారు.

విశాఖను ముంబైగా మారుస్తాం: చంద్రబాబు
విశాఖపట్నం సిటీని మరో ముంబైగా మారుస్తానని చంద్రబాబు అన్నారు. విశాఖ అభివృద్ధి చెందాలంటే... చుట్టుపక్కల గ్రామాల్లో అభివృద్ధి జరగాలన్నారు. విశాఖ జిల్లా చోడవరంలో జరిగిన రైతు సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. పాడేరులో పండే కాఫీ ప్రపంచంలోనే బ్రహ్మాండంగా ఉందన్నారు. విశాఖ జిల్లాలో లక్షా 30 వేల మంది మత్స్యకారులు ఉన్నారని ఆయన చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లోని రైతులను పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన తెలిపారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తామని చంద్రబాబు చెప్పారు. ప్రతి పట్టణానికి, గ్రామానికి మంచినీరు అందిస్తామన్నారు. అన్ని పారిశ్రామికవాడల్ని కలుపుతూ నీటి పైపులను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలను కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications