గుడ్ మార్నింగ్ సీఎం సార్... జగన్ సర్కార్ పై జనసేనాని పవన్ కళ్యాణ్ మరోఅస్త్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై, అసమర్థ పాలనపై, ప్రజల సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్న తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో అనేక సమస్యలు పరిష్కారం కాకుండా అలాగే ఉన్నాయని జనసేన అనేకమార్లు విమర్శలు గుప్పించింది. ఇక అలాంటి సమస్యలలో రోడ్ల సమస్య ఒకటి.
రోడ్ల దుస్థితిపై జనసేన మరో డిజిటల్ క్యాంపెయిన్
ఈ క్రమంలో తాజాగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు మరింత అధ్వానంగా దిగజారిన క్రమంలో మరోమారు జనసేన డిజిటల్ క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టింది. ఏపీ ప్రభుత్వ పాలనను ప్రజలకు కట్టడం కోసం త్వరలో జనసేన గుడ్ మార్నింగ్ సీఎం సార్ పేరుతో డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించనుంది. ఇప్పటికే రోడ్ల మరమ్మతుల కోసం స్వయంగా శ్రమదానం చేసి పెద్దఎత్తున పోరాటం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ మరోమారు కొత్త క్యాంపెయిన్ తో రంగంలోకి దిగుతున్నారు.

రోడ్ల మరమ్మత్తులకు జులై 15 వరకు డెడ్ లైన్ పెట్టిన జగన్
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల దుస్థితి పై ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతూనే ఉన్నాయి. ఇక జనసేన పార్టీ కూడా ఏపీలో అధ్వానంగా మారిన రోడ్లను బాగు చేయాలని పెద్ద ఎత్తున పోరాటం చేసింది. సోషల్ మీడియా వేదికగా డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించింది.
ఇక ఏపీ లో రోడ్ల దుస్థితి పై ఇటీవల సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూలై 15వ తేదీకల్లా మున్సిపాలిటీల పరిధిలో రోడ్ల అన్నింటినీ మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు నాడు నేడు పేరుతో ఆ రోడ్ల ఫొటోలను ప్రదర్శనకు పెట్టాలని కూడా సీఎం జగన్ ఆదేశించారు.
ఏపీలో అతీగతీలేని రోడ్ల మరమ్మత్తులు.. ప్రజల ఇబ్బందులు
అయితే ఏపీలో ఇప్పటివరకు రోడ్ల మరమ్మత్తులు కాలేదు. అంతేకాదు అనేక ప్రాంతాలలోమరింత దారుణంగా రోడ్ల దుస్థితి మారింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో గుంతలు పడిన రోడ్లు, చెరువులను తలపిస్తున్న రోడ్లు ఏపీ వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక జులై 15 వ తేదీన రోడ్ల మరమ్మతు డెడ్లైన్ విధించి ఇప్పటివరకు మరమ్మత్తులు చేయని రోడ్ల దుస్థితి పై జనసేన మరోమారు డిజిటల్ క్యాంపెయిన్ కు రెడీ అవుతోంది.

జులై 15 నుండి మూడు రోజుల పాటు గుడ్ మార్నింగ్ సీఎం సార్..
సీఎం జగన్ జూలై 15వ తేదీ వరకు రోడ్ల మరమ్మతులకు డెడ్ లైన్ పెట్టిన నేపథ్యంలో, ఆ రోజు నుంచి మూడు రోజులపాటు గుడ్ మార్నింగ్ సీఎం సార్ హ్యాష్ టాగ్ తో రోడ్ల దుస్థితి పై క్యాంపెయిన్ నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. మూడు రోజులపాటు సాగనున్న ఈ క్యాంపెయిన్ లో ఏపీ రోడ్ల విషయంలో జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను, ప్రస్తుతం ఉన్న రోడ్ల తీరును ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు జనసేన నాయకులు.












Click it and Unblock the Notifications