ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్
మారుతున్న కాలానికి అనుగుణంగా తమను తాము మార్చుకుంటూ తక్కువ ఖర్చులో సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పించడానికి భారతీయ రైల్వే నిరంతరం పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజుల లక్షల సంఖ్యలో ప్రయాణికుల కోసం 10,378 రైళ్లు నడుస్తున్నాయి. దేశానికి జీవనాడిగా రైల్వేను అభివర్ణిస్తారు. ప్రయాణికులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తోంది అనే విషయమై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్ సభలో వెల్లడించారు.
సీనియర్ సిటిజన్లకు, మహిళలకు రైల్వే ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తోందనే విషయాన్ని వివరించారు. టికెట్లు రిజర్వేషన్ చేయించుకునే క్రమంలో లోయర్ బెర్త్ టికెట్ల కోసం విపరీతమై పోటీ ఉంటోంది. టికెట్ తీసుకునే సమయంలోనే వీరికి లోయర్ బెర్త్ కన్ఫర్మేషన్ టికెట్లు అందిస్తామని మంత్రి వెల్లడించారు. సీనియర్ సిటిజన్లకే కాకుండా 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలకు కూడా ఈ సౌకర్యం కల్పిస్తున్నారు.

థర్డ్ ఏసీ బోగీల్లో బోగీకి నాలుగు నుంచి ఐదు లోయర్ బెర్త్ లు, సెకండ్ ఏసీ బోగీల్లో బోగీకి మూడు నుంచి నాలుగు కేటాయించారు. సీనియర్ సిటిజన్లతోపాటు 45 సంవత్సరాలు దాటిన మహిళలు, గర్భిణులకు కూడా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. టికెట్లు బుక్ చేసుకునే సమయంలోనే వీరికి లోయర్ బెర్త్ టికెట్లను రైల్వే సిబ్బంది కన్ఫామ్ చేసేలా నిబంధనలు రూపొందించారు. అంతేకాకుండా 60 సంవత్సరాలు అంతకంటే ఎక్కువున్నవారికి టికెట్ ధరలపై 40 శాతం తగ్గింపునిస్తున్నామని, అలాగే 58 సంవత్సరాలు దాటిన మహిళలకు కూడా 50 శాతం తగ్గింపునిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులకు, ఇతరత్రా సమస్యలున్నవారికి కూడా ఆయా నిబంధనలకు అనుగుణంగా తగ్గింపు ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు.












Click it and Unblock the Notifications