విజయవాడ వాసులకు అదిరిపోయే శుభవార్త.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశం!
విజయవాడ నగర వాసులకు శుభవార్త. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల విజ్ఞప్తి మేరకు విజయవాడను గ్రేటర్ విజయవాడ చేసే ప్రతిపాదనపై దృష్టి సారించమని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కలిసి చేసిన విజ్ఞప్తి మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
గ్రేటర్ విజయవాడ తో అనేక సమస్యలకు పరిష్కారం
నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన వీరు దీర్ఘకాలంగా విజయవాడను గ్రేటర్ విజయవాడ చేయాలన్న ప్రతిపాదన పైన తక్షణ చర్యలను కోరుతూ ఒక నివేదికను సమర్పించారు. విజయవాడ సమీపంలోని పెనమలూరు, మైలవరం, గన్నవరం నియోజకవర్గం ఇప్పటికే అనధికారికంగా నగరంలో కలిసిపోయాయని ఎంపీ కేశినేని చిన్ని సీఎంకు వివరించారు. గ్రేటర్ విజయవాడ ఏర్పాటు చేస్తే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వారు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.

నగరంలోని సమస్యలకు చంద్రబాబుకు చెప్పిన ఎమ్మెల్యే, ఎంపీలు
ప్రస్తుతం శివారు ప్రాంతాల్లో చెత్త నిర్వహణ దారుణంగా ఉందని. డ్రైనేజీలు, మురికినీరు వ్యవస్థ, వర్షపునీటి డ్రెయిన్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, జనాభా పెరుగుతున్నా సరైన తాగునీటి వసతిని అందించే పరిస్థితి లేదని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. తగిన రహదారులు, వీధిదీపాలు, ఆధునిక మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు అనధికార లేఅవుట్లు అక్రమ నిర్మాణాలపైన నియంత్రణ లేకుండా పోతుందని ఈ సందర్భంగా వారు చంద్రబాబుకు వివరించారు.
గ్రేటర్ విజయవాడతో నగరాభివృద్ధి
గ్రేటర్ విజయవాడ గా మారితే సరైన నిబంధనలతో, మాస్టర్ ప్లాన్ తో ప్రణాళికాబద్ధమైన నగరాభివృద్ధి సాధ్యమవుతుందని చంద్రబాబుకు తెలియజేశారు. ఇది విజయవాడలో పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్ హబ్ లు, ఐటీ పార్కులు, పర్యాటకంగా పెట్టుబడులకు భారీ అవకాశాలతో పాటు మెరుగైన ఉపాధిని అందిస్తుందని అన్నారు. ఎన్టీఆర్, కృష్ణ జిల్లాల మధ్య ఉన్న అనేక ప్రోటోకాల్ ఇబ్బందులకు గ్రేటర్ విజయవాడ ఏర్పాటుతో పరిష్కారం లభిస్తుందని నివేదిక ద్వారా వారు చంద్రబాబుకు తెలియజేశారు.
సానుకూలంగా స్పందించిన చంద్రబాబు.. కీలక ఆదేశం
ఇక ఈ ప్రతిపాదన పైన సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంవో సిబ్బందిని గ్రేటర్ ప్రతిపాదనలపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఇదే విషయాన్ని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలియజేసిన హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ గ్రేటర్ విజయవాడ అయితే విజయవాడ రూపురేఖలు మారుతాయని, అనేక దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వారన్నారు.












Click it and Unblock the Notifications