ఏపీకి మహర్దశ..20వేల కోట్ల భారీ పెట్టుబడులు.. ఘనత ఆయనదే!
ఏపీ దశ మారబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుండి ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. తాజాగా ఏపీలోని విశాఖకు పెద్దపెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడంతో ఆంధ్రప్రదేశ్ పంట పండుతుంది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సీఎంగా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్న భావన కలుగుతుంది. మంత్రి లోకేష్ చొరవతో వైజాగ్ కు పెట్టుబడులవర్షం కురవనుంది.
విశాఖలో భారీ పెట్టుబడులు
విశాఖ ఆర్థిక, సాంకేతిక రంగాలలో గణనీయమైన పురోగతి సాధించే దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. తాజాగా సచివాలయంలో జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో సీఎం చంద్రబాబు 20వేల కోట్ల పెట్టుబడులకు ప్రోత్సాహకాలను అందిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మొత్తంలో 16,466 కోట్లతో సిఫీ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయడం ముఖ్యమైనది. విశాఖ వేదికగా నాలుగు ప్రముఖ సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరించాలని ముందుకు రావడం గమనార్హం.

రాష్ట్రంలో 20 వేల కోట్లకు పైగా పెట్టుబడులు
సిఫీ, సత్వా, ఏఎన్ఎస్ఆర్, బివిఎం సంస్థలు రాష్ట్రంలో సుమారుగా రూ.20,216 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 50,600 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. ముఖ్యంగా సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ సంస్థ విశాఖపట్నంలో దాదాపు రూ. 16 వేల కోట్లకు పైగా పెట్టుబడులతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.
భారీ పెట్టుబడి పెట్టనున్న సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్
సిఫీ మొదటి దశలో రూ.1,466 కోట్ల పెట్టుబడితో 200 మందికి ఉపాధి లభిస్తుంది. ఇక రెండో దశలో రూ.15,000 కోట్ల పెట్టుబడులతో 400 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
ఇక విశాఖలోని మధురవాడలో సాత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ. 1,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది.
విశాఖలో పెట్టుబడులకు సిద్ధమైన సాత్వా డెవలపర్స్
సాత్వా డెవలపర్స్ రెసిడెన్షియల్, కమర్షియల్ ఐటీ, ఐటీఈఎస్ పార్కులకు సంబంధించిన ప్రాజెక్టులను అభివృద్ధి చేయడంలో ఈ సంస్థకు మంచి అనుభవం ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ 8 నగరాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ సంస్థ ఏపీలోని వైజాగ్ కు రావడం వైజాగ్ వాసులకు లాభమని ప్రభుత్వం భావిస్తుంది
1250కోట్ల పెట్టుబడులు పెట్టనున్న బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్
విశాఖలోని ఎండాడలో బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,250 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా, దీని ద్వారా 15 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తోంది. కపిల్ గ్రూపునకు చెందిన బీవీఎం విశాఖపట్నంలో మినీ స్మార్ట్ టెక్ సిటీని ఏర్పాటు చేయనుంది. ఇందులో ఆఫీస్ స్పేస్, కోవర్కింగ్ స్పేస్, ఉద్యోగుల నివాసాలు వంటివి ఉంటాయి.
మధురవాడలో రూ.1,000 కోట్లు ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుబడి
ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మధురవాడలో రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 10,000 ఉద్యోగావకాశాలు వస్తాయి. ఈ సంస్థకు డిజైనింగ్, ఎస్టాబ్లిషింగ్, జీసీసీ ఆపరేటింగ్‌లో మంచి అనుభవం ఉంది. ఇది ఇండియాతో పాటు పోలాండ్, యూఏఈలో కూడా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. మొత్తంగా ఈ కంపెనీలు లోకేష్ చొరవ వల్లే వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీకి ఈ ప్రతిష్టాత్మక కంపెనీలు రానుండడంతో ఏపీ దశ మారుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications