ఆ కోరిక తీర్చకుంటే నీ పిల్లల భవిష్యత్ నాశనం చేస్తా .. మహిళను వేధిస్తున్న కీచక టీచర్
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి మంచి మార్గంలో పెట్టాల్సిన ఉపాధ్యాయుడే చెయ్యకూడని పని చేశారు . నైతిక విలువలను పిల్లలకు నేర్పాల్సిన ఒక టీచర్ నైతిక విలువలు మరచి రాక్షసుడిలా ప్రవర్తించాడు. గుంటూరు జిల్లా బెల్లంకొండ కు చెందిన ఒక టీచర్ తన కోరిక తీర్చుకుంటే పిల్లల భవిష్యత్తు బుగ్గిపాలు చేస్తానంటూ ఒక మహిళను వేధించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
పేకాట క్వీన్స్ ... ఏపీలో పేకాడుతూ పట్టుబడిన మహిళలు.. షాక్ అయిన పోలీసులు

మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన గవర్నమెంట్ స్కూల్ టీచర్
బెల్లంకొండ మండలం న్యూ చిట్యాల గ్రామంలో బొల్లా శ్రీనివాసరావు అనే వ్యక్తి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన ఒక మహిళ పై కన్నేసిన ఉపాధ్యాయుడు తన కోరిక తీర్చాలని మహిళలను వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. ఇంటింటికి తిరిగి నిమ్మకాయలు విక్రయించుకునే సదరు మహిళను నిమ్మకాయలు విక్రయించి ఇంటికి వెళుతున్న క్రమంలో ఆమె చీర కొంగు పట్టుకుని లాగి చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.

కోరిక తీర్చకుంటే పిల్లల భవిష్యత్ నాశనం చేస్తానని బ్లాక్ మెయిల్
సదరు ఉపాధ్యాయుడుపై కోపంతో ఇంటికి వెళ్లిన మహిళను వెంబడించిన శ్రీనివాస రావు ఆమె ఇంటికి వెళ్లి మరీ తన కోరిక తీర్చాలంటూ ఇబ్బంది పెట్టాడు . మీ పిల్లలకు చదువు చెబుతా.. నా కోరిక తీర్చుకుంటే నీ పిల్లల భవిష్యత్ నాశనం చేస్తా... నన్నే వద్దంటావా అంటూ ఆ మహిళతో ఘర్షణ పడి, అడ్డు వచ్చిన ఆమె తల్లిదండ్రులను కొట్టి వెళ్లిపోయాడు. దీంతో బాధిత మహిళ కుటుంబ సభ్యులు బెల్లంకొండ క్రాస్ రోడ్డు వద్ద ఆందోళనకు దిగారు.

ధర్నా చేసిన బాధిత కుటుంబం .. కేసు నమోదు , పోలీసుల దర్యాప్తు
మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ ను విధుల నుంచి తొలగించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని ధర్నా చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాఠాలు చెప్పాల్సిన పంతుళ్ళు విచక్షణ మరచి ఈ తరహా చర్యలకు దిగుతుంటే, కామంతో కళ్లు మూసుకుపోయి మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే ఇలాంటి వారి వద్ద చదువులు నేర్చుకునే విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎలా తీర్చిదిద్దబడతారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.