కొత్త ఏడాదిలో గ్రేటర్ విజయవాడ ? నెలాఖర్లోగా ప్రకటన-విలీనం ఇలా..!
ఏపీలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాజధాని నగరం అమరావతిలో భాగంగా ఉన్న విజయవాడ సిటీని గ్రేటర్ విజయవాడగా మార్చేందుకు వేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ మేరకు ఎంపీ కేశినేని చిన్ని అందించిన ప్రతిపాదనలకు తోడు, ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు కూడా ఓకే చెప్పేశారు. దీంతో ఈ నెలాఖరులోనే కీలక ప్రకటనలు వెలువడబోతున్నాయి.
నిన్న సీఎం చంద్రబాబును విజయవాడకు చెందిన ఎంపీ కేశినేని, ఇతర ఎమ్మెల్యేలు కలిశారు. ఈ సందర్భంగా ఆయన గ్రేటర్ విజయవాడ ఏర్పాటుకు అంగీకరించారు. వెంటనే అధికారుల్ని పిలిచి ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో సీఎంవో అధికారులు సాయంత్రమే గ్రేటర్ విజయవాడ ఏర్పాటుకు సంబంధించి వారు ఇచ్చిన ప్రతిపాదనల మేరకు స్థానిక సంస్థల తీర్మానాలు చేసి పంపాలని కోరారు. దీంతో వారు ఇప్పటికే ఆయా స్థానిక సంస్థలు తీర్మానాలు చేసి ఇచ్చినట్లు తెలిపారు.

గ్రేటర్ లో మొత్తం విజయవాడ సిటీతో కలిపి 75 గ్రామాల్ని కలిపేందుకు ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపారు. ఇందులో 41 గ్రామాలు 2018లోనే గ్రేటర్ కోసం తీర్మానాలు చేశాయన్నారు. కొత్త గ్రామాలు కూడా తాజాగా తీర్మానాలు చేసి ఇచ్చాయన్నారు. వీటిపై సీఎంలో కార్యదర్శి ప్రద్యుమ్న స్పందిస్తూ.. అన్నీ సక్రమంగా ఉంటే ఈ నెలాఖరులోపు నోటిఫికేషన్ ఇస్తామని వారికి కీలక హామీ ఇచ్చారు. ఎందుకంటే డిసెంబర్ 31లోగా ఈ నోటిఫికేషన్ ఇవ్వకపోతే పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు. మరోవైపు త్వరలో ఏర్పాటయ్యే గ్రేటర్ విజయవాడ పరిధిలోకి మైలవరంలోని 23 గ్రామాలు, పెనమలూరులోని 19 గ్రామాలు, గన్నవరంలో 31 గ్రామాలను ప్రతిపాదిస్తున్నారు.













Click it and Unblock the Notifications