'ఆమె' కోసం చంద్రబాబు ఎదుట ప్రతిపాదన?
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అందుకనుగుణంగా ఏడాదిన్నర ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేసుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలో కొన్ని నియోజకవర్గాల్లో కొందరు సీనియర్ నేతల నుంచి పోటీచేసే నాయకుల కోసం డిమాండ్లు వస్తున్నాయి. అయితే గెలవగలరు అనుకున్న అభ్యర్థులనే ఆయన ముందుగా ఖరారు చేసుకుంటూ వెళుతున్నారు.

ఉద్యమానికి సేవలందిస్తున్న డాక్టర్ కొలికపూడి
అమరావతి ఉద్యమానికి డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర ముగిసిన తర్వాత డాక్టర్ కొలికపూడి అదే మార్గంలో పాదయాత్ర నిర్వహించారు. టీవీ ఛానల్స్ లోని డిబేట్లలో పాల్గొంటూ తెలుగుదేశం పార్టీ తరఫున, అమరావతి తరఫున బలమైన వాణి వినిపిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ నుంచి ఆయన పోటీచేసే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్నాయి.

ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తోన్న డాక్టర్ రాయపాటి శైలజ
అమరావతి జేఏసీ నాయకుల్లో ఒకరైన డాక్టర్ రాయపాటి శైలజ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్య మధ్యలో అవరోధాలెదురైనప్పటికీ వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఉద్యమం నుంచి విరమించుకుందామనేంత ఒత్తిడి ఆమెపై పడినప్పటికీ తట్టుకోగలిగారు.
రాయపాటి సోదరుల రాజకీయ వారసురాలిగా ఆమెను మలచాలని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి రానున్న ఎన్నికల్లో పోటీచేయడానికి వీలుగా ఆమెకు సీటు కేటాయించాలని రాయపాటి సోదరులతోపాటు డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు కూడా చంద్రబాబు ఎదుట ప్రతిపాదన పెట్టారు.

చివరి నిముషంలోనే తేలేది?
డాక్టర్ రమేష్ హాస్పటల్ లో వైద్యురాలిగాసేవలందిస్తున్న రాయపాటి శైలజకు గుంటూరు పశ్చిమ కేటాయిస్తే ఎలా ఉంటుంది? అనే కోణంలో చంద్రబాబు సర్వే వివరాలు కూడా తెప్పించుకున్నారు. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో గెలుపొందిన మద్దాలి గిరి వైసీపీకి అనుబంధ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇన్ ఛార్జిగా ఉన్న కోవెలమూడి రవీంద్ర నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నారు. రాయపాటి శైలజకే సీటిస్తారా? కోవెలమూడి రవీంద్రకిస్తారా? లేదంటే చివరి నిముషంలో అనూహ్యంగా కొత్త అభ్యర్థిని ఎంపిక చేస్తారా? అనేది చంద్రబాబు నిర్ణయంపై ఆధారపడివుంది.












Click it and Unblock the Notifications