‘బాహుబలి’ కట్టప్పను గుర్తుచేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. అసలు కథ ఇదే!
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం, సరఫరా గొలుసులో ఆటంకాలు, వాణిజ్య అనిశ్చితి నెలకొన్న వేళ.. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు భారత్ అత్యంత సురక్షితమైన, నమ్మకమైన గమ్యస్థానమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ప్రముఖ తెలుగు సినిమా 'బాహుబలి'లోని కట్టప్ప ఉదంతాన్ని ఉదాహరణగా చూపుతూ.. భారత్ ఎప్పుడూ తన మాటకు కట్టుబడి ఉంటుందని, ఎవరికీ వెన్నుపోటు పొడవదని ప్రపంచ దేశాలకు బలమైన సందేశం ఇచ్చారు.
'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?'.. గోయల్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
ప్రస్తుత గ్లోబల్ మార్కెట్ పరిస్థితులపై సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పీయూష్ గోయల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'బాహుబలి' సినిమాలోని ఆసక్తికరమైన ప్రశ్న'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?' అనే అంశాన్ని ప్రస్తావిస్తూ.. నేడు అంతర్జాతీయ వాణిజ్య భాగస్వాములు 'అసలు ఎవరిని నమ్మాలి? ' అని ప్రశ్నిస్తున్నారని అన్నారు.ఆ ప్రశ్నకు ఏకైక సమాధానం భారత్ అని ఆయన స్పష్టం చేశారు. భారత్ తన మాటకు కట్టుబడి ఉండే భాగస్వామి అని, ఏ దేశాన్నీ మోసం చేయదని, వెన్నుపోటు పొడవదని పీయూష్ గోయల్ పేర్కొన్నారు.

ఎడారిలో ఒయాసిస్సు లాంటిది భారత్
విశాఖపట్నంలో జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న పీయూష్ గోయల్.. అల్లకల్లోలంగా ఉన్న ప్రపంచ వాతావరణంలో భారత్ ఎడారిలో ఒయాసిస్సు లాంటిదని అభివర్ణించారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఓపెన్ మార్కెట్, సామర్థ్యం, విశ్వసనీయత అనే మూడు ప్రధాన హామీలను ఆయన ఇచ్చారు. ప్రపంచంలో ఎలాంటి తుఫానులు, యుద్ధాలు వచ్చినా భారత విధానాలు స్థిరంగా ఉంటాయని, చట్టాలు నిష్పక్షపాతంగా పనిచేస్తాయని భరోసా ఇచ్చారు. భారత్ ఎప్పుడూ బలవంతపు టెక్నాలజీ బదిలీని కోరదని, ఇతర దేశాల ఆవిష్కరణలను దొంగిలించదని.. బదులుగా మేధో సంపత్తి హక్కులకు పూర్తి రక్షణ కల్పిస్తుందని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.
85 ట్రిలియన్ డాలర్ల మార్కెట్‌కు భారత్ ద్వారం
భారత్ విస్తరిస్తున్న వాణిజ్య బంధాల గురించి పీయూష్ గోయల్ వివరిస్తూ.. గత నాలుగున్నరేళ్లలో 38 అభివృద్ధి చెందిన దేశాలతో 9 స్వేచ్ఛా లేదా ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుతున్నట్లు వెల్లడించారు. 2014కు ముందున్న ఒప్పందాలను కలుపుకుంటే దాదాపు 70 ట్రిలియన్ డాలర్ల జీడీపీ కలిగిన ఆర్థిక వ్యవస్థలకు భారత్‌కు మార్కెట్ యాక్సెస్ లభించిందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ద్వైపాక్షిక, బహుపాక్షిక చర్చలు పూర్తయితే మరో 15 ట్రిలియన్ డాలర్లు తోడవుతాయని, తద్వారా 115 ట్రిలియన్ డాలర్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాదాపు 85 ట్రిలియన్ డాలర్ల మార్కెట్‌కు భారత వస్తువులు, సేవలు, నైపుణ్యాలకు నేరుగా అవకాశం లభిస్తుందని వివరించారు.
ఏపీ ప్రాజెక్టుల ప్రస్తావన.. 21వ శతాబ్ధంలో నమ్మకమే కీలకం
20వ శతాబ్ధంలో తక్కువ ధరకే ఉత్పత్తి చేయడం కోసం పోటీ ఉండేదని, కానీ 21వ శతాబ్ధంలో నమ్మకం అత్యంత కీలకమని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో 100కు పైగా వ్యాక్సిన్లు, మందులు, ఆహార ధాన్యాలు అందించి భారత్ తన గొప్పదనాన్ని నిరూపించుకుందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రపదేశ్‌లో అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక హబ్‌లు, తిరుపతి స్పేస్ సిటీ, ఓర్వకల్లు డ్రోన్ సిటీ, పూడిమడక గ్రీన్ హైడ్రోజన్ హబ్ లను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అమెరికా, యూరప్‌లతో పోలిస్తే ఇండియాలో ఐదో లేదా ఆరో వంతు ఖర్చుతోనే ప్రపంచ స్థాయి పరిశోధన, ఆవిష్కరణలు సాధ్యమవుతాయని పేర్కొంటూ.. ఇక్కడ తయారీ యూనిట్లు, డేటా సెంటర్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయాలని అంతర్జాతీయ కంపెనీలను పీయూష్ గోయల్ ఆహ్వానించారు.
Why did Kattappa kill Baahubali?The whole country once asked that question.In global trade today, partners are asking a different one:"Who can we trust?"The answer is India.A partner who keeps its word.A partner who will never stab you in the back.#CIIPartnershipSummit2026
— Piyush Goyal (@PiyushGoyal) November 12, 2026













Click it and Unblock the Notifications
