కెసిఆర్ శిష్యుడేమిటి, బాబుకు సోయి లేదు: హరీష్

చంద్రబాబు మాటలు వింటుంటే, ఆయనకు మతి తప్పిందని తేలిపోయిందని, ఏం మాట్లాడుతున్నారో పార్టీ నేతలకే కాదు, ఆయనకూ అర్థం అవుతున్నట్లు లేదని, అబద్ధాలు ఆడటానికి కూడా ఒక హద్దు ఉంటుందని హరీష్ రావు మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.
కెసిఆర్ 1983లో సిద్ధిపేట నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారని, ఆ సమయానికి చంద్రబాబు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. టిడిపిలో కెసిఆర్ ముందు చేరారని, తర్వాత చంద్రబాబు టిడిపిలోకి వచ్చారని ఆయన అన్నారు. జనం ఏమనుకుంటారోననే సోయి లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో వచ్చే సీట్లు సింగిల్ డిజిట్ దాటవని, అన్ని సర్వేలు అదే విషయాన్ని చెబుతున్నాయని చంద్రబాబును నిలదీశారు. కాగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని సిద్దిపేటలో హరీష్ రావు చెప్పారు. ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు, ఇల్లు, ఉద్యోగం, శాశ్వత ఆధారం కల్పిస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications