బాబు కుట్రపై పలకరేం: టిటిడిపికి హరీష్, కెసిఆర్‌పై కృష్ణ
హైదరాబాద్: పోలవరంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి కుట్ర చేస్తుంటే తెలంగాణ టిడిపి నేతలు మహానాడులో ఎందుకు పెదవి విప్పడం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బుధవారం అన్నారు. పోలవరం విషయంలో టిడిపి పూర్తిగా సీమాంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు.
ఖమ్మంలోని 205 గ్రామాలను సీమాంధ్రలో కలిపి, తెలంగాణ గిరిజనులను ముంచడానికి చంద్రబాబు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని ధ్వజమెత్తారు. తనకు తెలిసిన సమాచారం మేరకు.. నిన్నటి కేబినెట్లో ఆర్డినెన్స్ వచ్చిందని చెప్పారు. మహానాడులో టిడిపి నేతలు పోలవరం పైన ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఆంధ్రోళ్లు పెట్టిన అన్నం తిని, వారి ఉపన్యాసాలు విని టిటిడిపి నేతలు నిద్రపోతున్నారని ధ్వజమెత్తారు. వారికి చీమ కుట్టినట్లుగా కూడా లేదన్నారు.

పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపడం అంటే ఆరు మండలాల్లో గిరిజనులకు మరణ శాసనమన్నారు. పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, డిజైన్ మార్చాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, వెంకయ్యలు ఆర్డినెన్స్ తీసుకు వస్తున్నారన్నారు. టిటిడిపి నేతలు మహానాడులో చంద్రబాబును నిలదీయాలన్నారు. ఇంత కుట్ర జరుగుతున్నా మాట్లాడక పోవడం విడ్డూరమన్నారు.
చంద్రబాబు తెలంగాణ ప్రజల గొంతు కోస్తుంటే కట్టుబానిసల్లా, ఆ పార్టీలోనే ఉంటారా అని ప్రశ్నించారు. చీము, నెత్తురూ ఉంటే మహానాడులోనే చంద్రబాబు కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. ఈ అంశంపై తెలంగాణ బిజెపి నేతలు కూడా స్పందించాలన్నారు. లేదంటే వారిని తెలంగాణ సమాజం క్షమించదన్నారు. పోలవరం డిజైన్ మార్చకుంటే తాము న్యాయస్థానంకు వెళ్లి పోరాడుతామన్నారు. వార్ రూం సమస్యల పరిష్కారానికేనని, ఎవరిపైనో యుద్ధానికి కాదన్నారు. జూన్ 2న ఉదయం ఎనిమిదింపావుకు కెసిఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారని, గవర్నర్‌కు కూడా సమాచారం అందించామన్నారు.
కెసిఆర్‌పై మందకృష్ణ
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు మందకృష్ణ మాదిగ సూచన చేశారు. ఎన్నికలకు ముందు హామీ మేరకు.. కెసిఆర్ తెలంగాణ సిఎం పదవిని దళితుడైన కొప్పుల ఈశ్వర్‌కు ఇవ్వాలని, డిప్యూటీ సిఎం పదవి ఆయన తీసుకోవాలన్నారు.
ఆల్ ఫ్రీ అన్నవారే అధికారంలోకి: షబ్బీర్ అలీ
కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి నజ్మా హెఫ్తుల్లా పైన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ బుధవారం మండిపడ్డారు. నజ్మాకు ముస్లింల సమస్యలు తెలియవన్నారు. ముస్లింలకు రిజర్వేషన్ అవసరం లేదన్న ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెసు పార్టీలో నేతలు పోటీ పడ్డారన్నారు. రెండు రాష్ట్రాల్లో ఆల్ ఫ్రీ అన్న పార్టీలే అధికారంలోకి వచ్చాయని విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావోత్సవాన్ని తాము ఘనంగా నిర్వహిస్తామన్నారు.












Click it and Unblock the Notifications