HBDYSJagan: నా కట్టె కాలే వరకు జగనన్నతోనే.. కొడాలి నాని ఉద్వేగం!!
రాజకీయాలలో ట్రెండ్ సెట్టర్ ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి. ఒక్కడుగా ప్రయాణాన్ని ప్రారంభించి లీడర్ గా ఎదిగిన ప్రజా నాయకుడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనం సృష్టించి, పదేళ్లపాటు ఏపీ రాజకీయాల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని వైయస్సార్ సిపి ని తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దిన నాయకుడు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతిపక్షాలు ఎంతగా విమర్శలు చేస్తున్నా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ప్రజల మద్దతును పొందుతున్న సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి. నేడు వైయస్ జగన్మోహన్ రెడ్డి 50 వ జన్మదినం. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు సోషల్ మీడియా ను షేక్ చేస్తున్నాయి.

మొదలెడదామా.. అంటూ జగన్ పై ట్వీట్ ల వర్షం కురిపించిన కొడాలి నాని
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఇప్పటికే ప్రధాని మోడీతో పాటు పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక మాజీ మంత్రి కొడాలి నాని నిన్నటి నుండి జగన్మోహన్ రెడ్డి కి శుభాకాంక్షలు చెప్పడం మొదలుపెట్టారు. ఇక మొదలెడదామా అంటూ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా సోషల్ మీడియా షేక్ అవుతుందంటూ.. ఏది ఓపెన్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఫోటోలు కనిపిస్తున్నాయి అంటూ ఓ పోస్ట్ పెట్టారు.
హ్యాపీ బర్త్ డే సీఎం సాబ్.. అంటూ వీడియోలతో అభిమానం చూపే యత్నం
ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గురించి గతంలో మహేష్ బాబు, మంచు విష్ణు, సూపర్ స్టార్ కృష్ణ, పోసాని కృష్ణ మురళి, చిరంజీవి, విశాల్ తదితరులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వీడియోలను రీ ట్వీట్ చేసి జగన్మోహన్ రెడ్డికి ఉన్న మద్దతును తెలియజేశారు. అంతేకాదు జనం కోసం జ్వాలా పుత్రుడు పుట్టాడు అంటూ ఓ సినిమా డైలాగ్ ని ట్వీట్ చేసిన కొడాలి నాని హ్యాపీ బర్త్ డే సీఎం సాబ్ అంటూ వైయస్ జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.
తన కట్టె కాలేవరకు జగనన్నతోనే అంటూ ట్వీట్
ఇక తన కట్టె కాలే వరకు జగనన్నతోనే అంటూ ఉద్వేగభరితమైన పోస్ట్ చేసిన కొడాలి నాని తాను చచ్చేవరకు పార్టీ మారనని, రాజకీయాల్లో పదవిలో ఉన్నా లేకున్నా, అధికారంలో ఉన్నా లేకున్నా తన ప్రయాణం జగన్మోహన్ రెడ్డితోనే అని స్పష్టం చేశారు. ఇక దమ్మున్న నాయకుడు కి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ పేదలకు సంక్షేమ సారధి గా మారారని ఒక వీడియోను పోస్ట్ చేసి కొడాలి నాని పేర్కొన్నారు.

విజయమ్మ జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన వీడియో పోస్ట్
వైయస్ జగన్మోహన్ రెడ్డికి విజయమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వీడియోను రీ పోస్ట్ చేసిన కొడాలి నాని, తల్లి విజయమ్మ ప్రేమ వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎప్పటికీ ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కొడాలి నాని ట్విట్టర్ వేదికగా హడావుడి చేస్తున్నారు. వీడియోలతో హోరెత్తిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ది లీడర్ అంటూ కొనియాడుతున్నారు. తన ప్రయాణం చివరి వరకు జగన్ మోహన్ రెడ్డి తో నేనని తేల్చి చెబుతున్నారు.












Click it and Unblock the Notifications