ఈ జాప్యమేమిటి: శేషాచలం కేసు విచారణపై సిట్‌ను ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్: శేషాచలం ఎదురు కాల్పుల వ్యవహారంపై విచారణలో ఎందుకు జాప్యం జరుగుతోందని హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రశ్నించింది. అయితే, ఫోరెన్సిక్ నివేదక కోసం తాము వేచిస్తున్నట్లు సిట్ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. శేషాచలం ఎదురు కాల్పుల కేసులో వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ఎపి రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్‌ను ఆదేశించింది.
సాంకేతిక, శాస్త్రీయ అంశాలను విశ్లేషించేందుకు, అనుభవజ్ఞులను నియమించేందుకు ప్రయత్నిస్తున్నామని, దానికోసం స్థానిక మెజిస్ట్రేట్ అనుమతి కోరామని సిట్ తరఫు న్యాయవాది చెప్పారు. దర్యాప్తు కోసం అనుభవజ్ఝుల నియామకానికి కోర్టు అనుమతి ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది.

సిట్ తరఫున ఇక నుంచి తాను వాదిస్తానని, ప్రభుత్వం తరఫున మరొకరు హాజరవుతారని అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. గతంలో ప్రతివాదులందరి తరఫున వాదించిన న్యాయవాది ఇప్పుడు సిట్ తరఫున ఎలా ఉంటారని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశ్నించారు.
సిట్ విచారణకు హైకోర్టు 60 రోజులు గడువు విధించిందని, 140 రోజులు దాటినా ఇంకా పూర్తి కాలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది అన్నారు. విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications