పోటెత్తిన భక్తులు: తిరుమల క్యూలైన్లో తొక్కిసలాట
తిరుపతి: తిరుమల దివ్యదర్శనం క్యూలైనులో సోమవారం తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో నారాయణగిరి ప్రాంతంలో ఉద్రిక్తత తలెత్తింది. భక్తుల సంఖ్యకు తగినమేర భద్రత సిబ్బంది, పోలీసులు లేకపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. వారు నిస్సహాయులు కావడంతో భక్తులంతా ఒక్కుమ్మడిగా ముందుకు నడవగా తోపులాట, తొక్కిసలాటలో కొందరు కిందపడి గాయపడ్డారు.
పెరటాసినెల రెండో శనివారం, ఆదివారం, దసరాసెలవుల ప్రారంభంతో మూడు రోజులుగా కొండపై రద్దీ విపరీతంగా ఉంటోంది. ప్రధానంగా ఇరువైపులా కాలినడకన అసంఖ్యాకంగా భక్తులు తరలిరాగా, తిరుమల జనసంద్రంలా మారింది. ఆదివారం ఉదయం నుంచే దివ్యదర్శనం క్యూలైన్‌లో పూర్తిగా నిండిపోయింది. దీంతో కొంత ఖాళీకాగానే అందుకు సరిపడా భక్తులను పంపేందుకు పోలీసులు, భద్రత సిబ్బంది చర్యలు చేపట్టారు.

ఆదివారం మధ్యాహ్నం ఎంతసేపటికీ క్యూలైను కదలకపోవడంతో భక్తులు సహనం కోల్పోయి పోలీసులను తోసుకుంటూ ముందుకు దూసుకెళ్లారు. నిరోధించిన సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
ఈ క్రమంలో పోలీసులు లాఠీలకు పనిచెప్పి పరిస్థితిని కొంత అదుపులోకి తెచ్చారు. అటుపైన అదనపు సిబ్బందిని రప్పించి క్యూలైన్‌ను క్రమబద్ధీకరించారు. అలాగే దివ్యదర్శనం క్యూలైనులోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించడంతో పరిస్థితి చక్కబడింది.
మళ్లీ సోమవారం సాయంత్రం మళ్లీ అదే స్థలంలో మరోసారి తోపులాట మొదలైంది. గంటల తరబడి వేచి ఉండలేక భక్తులు ముందుకొస్తుండగా, పోలీసులు తాళ్లతో అడ్డుకున్నారు. కానీ, వారిని తోసుకుంటూ అందరూ ఒకేసారి పరుగులు తీయడంతో తోపులాట, తొక్కిసలాట జరిగి పలువురు గాయపడ్డారు.












Click it and Unblock the Notifications