హై పవర్ కమిటీ కూడా తేల్చి చెప్పేది అదేనా ..? వికేంద్రీకరణే కమిటీల నిర్ణయమా?
ఆంధ్రప్రదేశ్లో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటన అమలు జరగబోతుందా ? ఇప్పటివరకు ఏపీ రాజధాని కోసం వేసిన కమిటీలు ఇస్తున్న నివేదికలన్నీ అదే చెప్తున్నాయా ? పరిపాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ ధ్యేయంగా కమిటీలు నివేదికలు అందిస్తున్నాయా ? ఇక తాజాగా హైపవర్ కమిటీ కూడా అదే చెప్పబోతుందా ?ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఖాయమైనట్లేనా? అంటే తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి.

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండీ రాజధానిపై నీలినీడలు
గత అసెంబ్లీ ఎన్నికల తరువాత ఏపీలో అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాటి నుండి నేటి వరకు రాజధాని అమరావతి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చింది. పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుండి రాజధానిగా అమరావతి సరైన ప్రదేశం కాదని,ముంపుకు గురవుతుందని, రాజధాని అమరావతి లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని పలు విమర్శలు చేస్తూ రాజధాని అమరావతిపై ప్రజల్లో సందిగ్ధం నెలకొనేలా చేసింది.

రాజధాని పై జీఎన్ రావు కమిటీ ఏర్పాటు
ఇక ఆ తర్వాత రాజధాని అమరావతి కొనసాగించాలా వద్దా అనే అంశంపై ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా రాజధానిపై తేల్చి చెప్తామని ప్రకటన చేసింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిఎన్ రావు కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి నివేదికను అందజేసింది. అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ జరగాలని ఆ నివేదికలో పేర్కొంది.

బోస్టన్ కమిటీ నివేదిక కూడా వికేంద్రీకరణ వైపే
ఇక ఆ తర్వాత జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులతో పాటి బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక కూడా వికేంద్రీకరణ వైపే మొగ్గు చూపుతూ నివేదిక ఇచ్చింది. ఇక తాజాగా జిఎన్ రావు కమిటీ , బోస్టన్ కమిటీ నివేదిక మీద అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ కూడా వికేంద్రీకరణ వైపు అడుగులు వేస్తున్నట్లుగా తాజా పరిణామాలతో తెలుస్తోంది.
రాజధాని కమిటీల నివేదికలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన హై పవర్ కమిటీ తొలిసారిగా విజయవాడ సమావేశమైంది.

విజయవాడలో హై పవర్ కమిటీ సమావేశం
దాదాపు మూడున్నర గంటలపాటు నిర్వహించిన ఈ సమావేశంలో పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ ఆవశ్యకతపై సుదీర్ఘంగా చర్చలు జరిపింది. అంతేకాదు పరిపాలన వికేంద్రీకరణ లో భాగంగా ఎగ్జిక్యూటివ్ రాజధాని ఎక్కడ ఉండాలి. అక్కడ అనుకూలంగా ఉన్న పరిస్థితులు ఏంటి ? అన్న అంశాల పైన హై పవర్ కమిటీ సభ్యులు చర్చించారు. ఇక జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ ప్రతినిధులు కూడా తమ నివేదికలో ప్రస్తావించిన అంశాలపై హైపవర్ కమిటీకి వివరించారు.

వికేంద్రీకరణ ప్రాధాన్యతాంశంగా చర్చించిన హైపవర్ కమిటీ
గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చును భరించే స్థోమత ఏపీకి లేదని వివరించింది. ఓవరాల్ గా అధికార వికేంద్రీకరణతోపాటు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని హై పవర్ కమిటీ సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవిస్తూ పరిపాలన వికేంద్రీకరణ అవసరమని ప్రాథమికంగా అంచనా వేస్తున్న హైపవర్ కమిటీ కూడా వికేంద్రీకరణ వైపే తమ నివేదిక ఇవ్వనున్నట్లు గా తెలుస్తోంది.

రాజధాని రైతుల అభిప్రాయాలు పరిగణనలోనికి తీసుకుంటామని ప్రకటన
అయితే పరిపాలన వికేంద్రీకరణపై రాజధాని రైతుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటామని హైపవర్ కమిటీ చెబుతుంది. గత ప్రభుత్వం ఏకపక్షం నిర్ణయం తీసుకుందని విమర్శించారు కమిటీ సభ్యులు..తాము అందరితో చర్చిస్తామని అంటున్నారు. ఇప్పటికే ఏకపక్ష నిర్ణయమని పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్న సమయంలో అందరితో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని హైపవర్ కమిటీ చెబుతోంది.

పరిపాలనా వికేంద్రీకరణ వైపు మొగ్గు చూపుతున్న హైపవర్ కమిటీ
జీఎన్ రావు, బోస్టన్ కమిటీ నివేదికల్లాగే హైపవర్ కమిటీ కూడా పరిపాలన వికేంద్రీకరణ దిశగానే హైపవర్ కమిటీ తన నివేదికను రూపొందించనున్నట్లు గా నిన్న జరిగిన చర్చ ఆధారంగా అర్థమవుతుంది. అంతేకాకుండా మరోపక్క విశాఖలో శరవేగంగా సెక్రటేరియట్ ఏర్పాటుకు, ప్రభుత్వ భవనాల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో జగన్ 3 రాజధానుల నిర్ణయమే తుది నిర్ణయం గా హై పవర్ కమిటీ కూడా నివేదిక ఇస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.












Click it and Unblock the Notifications