ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ రీ నోటిఫికేషన్ పై విచారణ వాయిదా.. కౌంటర్ దాఖలుకు ఎస్ఈసికి ఆదేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలను గతంలో నిలుపుదల చేసిన దగ్గర నుండి నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫిబ్రవరి 18న ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చింది. దీనిపై ఏపీ లోని ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని, పాత ఎన్నికలను పూర్తిగా రద్దు చేసి, కొత్త ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేశాయి. కోర్టు మెట్లెక్కాయి.
Recommended Video

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రతిపక్షాల డిమాండ్
రాష్ట్ర ఎన్నికల కమిషన్ గతేడాది ఇచ్చిన నోటిఫికేషన్ ఇంకా మనుగడలో ఉందని, కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాదని, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత దానిని ప్రశ్నించడానికి వీలు లేదని చెప్పి గత ఎన్నికలకు కొనసాగింపుగా ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ నే కొనసాగించడంపై ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నామినేషన్ల ప్రక్రియ అధికార పార్టీ నాయకుల బెదిరింపులు, కిడ్నాప్ లతో గందరగోళంగా జరిగిందని వారు ప్రధానంగా ఆరోపించారు.

కోర్టు మెట్లెక్కిన ప్రతిపక్షాలు .. విచారించిన కోర్టు
దీనిపై హైకోర్టులో పదకొండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల నిర్వహణకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని దాఖలైన పిటిషన్లపై ఇప్పటికే విచారణ జరిపిన హైకోర్టు ఈరోజు మరోమారు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ రీ నోటిఫికేషన్ వ్యవహారంపై విచారణ జరిపింది. రీ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు అటు పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు , రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది వాదనలు విన్నది.

కౌంటర్ అఫిడవిట్ దాఖలుకు సమయం కోరిన ఎస్ఈసి .. కేసు మార్చి 8వ తేదీకి వాయిదా
జనసేన కార్యదర్శితో పాటుగా పలువురు పిటిషన్లు దాఖలు చేసిన ఈ కేసులో గతంలో నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా అధికార పార్టీకి చెందిన వారు తమ నామినేషన్లు వేయకుండా బలవంతంగా అడ్డుకున్నారని పిటిషనర్లు పేర్కొన్నారు. గత విచారణలో దీనిపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయవలసిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. అయితే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చెయ్యని అధికారులు , కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడం కోసం సమయం కావాలని ఎన్నికల సంఘం ఏపీ హైకోర్టు కు విజ్ఞప్తి చేసింది. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications