ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి - వాతావరణ శాఖ బిగ్ అప్డేట్..!!
రాష్ట్రంలో వాతావరణంలో అనూహ్య మార్పు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఒక వైపు వర్షాలు కురుస్తున్న కోస్తా జిల్లాలతో పాటుగా రాయలసీమ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. సగటున 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోత కారణంగా విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఇదే సమయంలో వాతావరణ శాఖ పలు జిల్లాల కు కీలక అలర్ట్స్ జారీ చేసింది.
ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో తేమశాతం పెరగడంతో ఎండ వేడి పెరుగుతోంది. ఉక్కపోత కారణంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. దీనికితోడు వాతావరణంలో తేమశాతం అధికంగా ఉండటంతో.. పలు ప్రాంతాల్లో ఉక్కపోత ప్రభావమూ ఎక్కువగానే ఉంది. దీంతో శరీరం చెమటలు కక్కుతోంది.

ఉక్కపోతతో
వాతావరణ మార్పులతో ఆరోగ్యంపైనా ప్రభావం పడుతోంది. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబరులో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంటాయి. దీంతో వాతావరణం చల్లబడుతుంది. గత వారం రోజులుగా ఈ పరిస్థితులు లేకపోవడంతో ఎండల తీవ్రత పెరిగింది. మరో రెండు రోజుల పాటు ఈ పరిస్థితి ఉండే అవకాశం ఉంది. తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల ప్రభావం రాష్ట్రంపై బలహీనంగా ఉంది. దీంతో ఎండల తీవ్రత అధికమైంది. కోస్తాలో మరింత ఎక్కువగా కన్పిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 4.5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి.
వర్షంపై అలర్ట్
తాజాగా ఐఎండీ సూచనల ప్రకారం రేపు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, నంద్యాల, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.












Click it and Unblock the Notifications