నిప్పుల కొలిమి, వర్షాలు - ఏపీలో ఈ జిల్లాలకు తీవ్ర హెచ్చరిక ..!!
భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. మొన్నటి వరకు వర్షాలతో కాస్త తెరిపినిచ్చినా, ఉదయం నుంచి సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. గరిష్ఠ ఉష్టోగ్రతలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రం లోని అనేక ప్రాంతాల్లో వేడి వాతావరణం నెలకొంది. గురువారం మధ్యాహ్నం కొన్ని ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా 139 ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలపైనే నమోదయ్యాయి. ఇదే సమయంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పిడుగులతో కూడిన వర్షాల పైన తాజాగా వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేసింది.
రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా 139 ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలపైనే నమోదయ్యాయి. నంద్యాల జిల్లా దొర్నిపాడులో 43.8, ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో 43.7, కడప జిల్లా అట్లూరులో 43.6, విజయనగరంలో 42.8, కర్నూలు జిల్లా కామవరం, పల్నాడు జిల్లా నర్మలపాడులో 42.7, జంగమహేశ్వరపురంలో 42.5, ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు లో 42.4, నెల్లూరు జిల్లా మునుబోలు, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 42.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత లు నమోదయ్యాయి. కాగా, ఛత్తీస్ ఘడ్ నుంచి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకూ విస్తరించిన ఉపరితలద్రోణి ప్రభావంతో కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రానున్న రెండు రోజుల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇక, ఈ రోజు (శుక్రవారం) శ్రీకాకుళం జిల్లా -4, విజయనగరం-5, పార్వతీపురం మన్యం -8... ఇలా రాష్ట్రంలోని మొత్తం 17 మండలాల్లో తీవ్రవడగాలులు, 21 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. రేపు (శనివారం) 12 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. శని, ఆది వారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. భిన్నమైన ఈ వాతావరణ పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వడగాల్పుల తీవ్రత పెరుగుతుండటంతో.. వడదెబ్బ కేసులు నమోదు అవుతున్నాయి. తెలంగాణలో వడదెబ్బ కారణంగా ఒకరు మరణించిన నట్లు గుర్తించారు.












Click it and Unblock the Notifications