పేర్నినాని-వర్మ హాట్ హాట్ చర్చ-సంతృప్తికరమన్నఆర్జీవీ-చట్టం ఎవరికీ చుట్టం కాదన్న మంత్రి
ఏపీలో వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల నియంత్రణ కోసం చేస్తున్న ప్రయత్నాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇవాళ మంత్రి పేర్నినానితో భేటీ అయ్యారు. టికెట్ల రేట్లతో పాటు మొత్తం ఐదు అంశాలపై చర్చలు జరిపారు. మధ్యలో వీరిద్దరూ లంచ్ కూడా చేశారు. అనంతరం మరోసారి భేటీ అయి కీలక చర్చలు జరిపారు. రెండున్నర గంటల పాటు భేటీ తర్వాత వర్మ హైదరాబాద్ తిరిగి వెళ్లిపోయారు.
Recommended Video

పేర్ని-వర్మ చర్చలు
టాలీవుడ్ సినిమా టికెట్ల ధరలపై నెలకొన్న వివాదం నేపథ్యంలో ఏపీ మంత్రి పేర్నినాని ఆహ్వానం మేరకు ఇవాళ అమరావతి వచ్చిన దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ సచివాలయంలో ఆయనతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సమావేశమయ్యారు. సినిమా టికెట్ రేట్ల తగ్గింపు విషయంలో ముందునుంచీ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను ఆయన ఇవాళ మంత్రి పేర్నినానికి మరోసారి వివరించారు. టాలీవుడ్ కూ, ప్రేక్షకులకూ మధ్య ప్రభుత్వం ఎందుకంటూ లేవనెత్తిన వాదనను కూడా ఈ భేటీలో మరోసారి ప్రస్తావించారు. దీనికి మంత్రి పేర్నినాని తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు.

ఐదు అంశాలపై చర్చలు
పేర్నినాని-రామ్ గోపాల్ వర్మ భేటీలో మొత్తం ఐదు అంశాలు చర్చకు వచ్చాయి. ఇందులో సినిమా టికెట్ల ధరల వ్యవహారం కీలకమైనది కాగా.. టాలీవుడ్ కు సంబంధించిన మరో నాలుగు అంశాలు కూడా ఉన్నాయి. అయితే సినిమా థియేటర్లపై అధికారుల దాడుల వ్యవహారం మాత్రం వీరిద్దరి భేటీలో చర్చకు రాలేదని తెలుస్తోంది. దీంతో ఆ ఐదు అంశాలపైనే పేర్ని-వర్మ దాదాపు రెండున్నర గంటల పాటు చర్చించారు. ఈ సందర్భంగా వర్మ చేసిన డిమాండ్ల సాధ్యాసాధ్యలపై ఎక్కువగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

మధ్యలో నాన్ వెజ్ లంచ్
తనతో సమావేశం కోసం హైదారాబాద్ నుంచి వచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మంత్రి పేర్నినాని ఆయన రేంజ్ కు తగినట్లుగా లంచ్ ఏర్పాటు చేశారు. సచివాలయంలో ప్రత్యేకంగా తయారు చేయించిన నాన్ వెజ్ ఐటమ్స్ ను ఆయన కోసం సిద్ధం చేశారు. దీంతో వీరిద్దరూ చర్చల మధ్యలో పావుగంట సేపు లంచ్ చేశారు. వర్మ కోసం పేర్ని తయారు చేయించిన లంచ్ లో చికెన్ బిర్యానీ, మటన్ తో పాటు రొయ్యల కూర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో లంచ్ పూర్తయ్యాక మరోసారి వీరిద్దరూ భేటీ అయ్యారు.

చర్చలు సంతృప్తికరమన్న వర్మ
మంత్రి పేర్నినానితో దాదాపు రెండున్నర గంటలకు పైగా చర్చలు జరిపిన ఆర్జీవీ అనంతరం బయటికొచ్చాక చర్చలు సంతృప్తికరంగా జరిగాయని ప్రకటించారు. తమ మధ్య చర్చల తర్వాత సినిమా టికెట్ల ధరల విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వెలువడుతుందని వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరూ కావాలని నష్టం చేయాలని కోరుకోరని, ప్రభుత్వం కూడా తమ పరిధిలో నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ఈ సందర్భంగా టికెట్ల ధరలు పెరిగితే జనం ఇబ్బందులు పడతారని మంత్రి నాని తనతో చెప్పినట్లు వర్మ వెల్లడించారు. రేపు ప్రభుత్వం నియమించిన కమిటీకి తన అభిప్రాయాలు తెలియజేస్తానని వర్మ తెలిపారు.

చట్టం ఎవరికీ చుట్టం కాదన్న పేర్ని
వర్మతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్నినాని.. చట్ట ప్రకారమే టికెట్ల ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు మరోసారి వెల్లడించారు. అదే విషయం వర్మకు కూడా చెప్పామన్నారు. వర్మ తరహాలోనే టాలీవుడ్ నుంచి ఎవరు ముందుకొచ్చినా వారి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ముందు ఎవరైనా అభిప్రాయాలు చెప్పొచ్చన్నారు. తాము మాత్రం చట్టం పరిధి దాటి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదన్నారు.












Click it and Unblock the Notifications