జగన్‌పై డిగ్గీ: విజయమ్మ ఆగ్రహం, దీక్షపై ప్రణబ్ అడిగారు
న్యూఢిల్లీ: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తనకు మంచి స్నేహితుడని, పార్టీకి ఆయన ఎంతో చేశారని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తనకు తనయుడి లాంటి వాడన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ పైన ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైయస్ మంచి స్నేహితుడే అయితే ఆయన పేరును సిబిఐ ఎఫ్ఐఆర్‌లో ఎలా చేర్చారని, జగన్‌ను తనయుడి లాంటి వాడు అన్నప్పుడు అతనిని పదహారు నెలలు జైలులో ఎలా ఉంచారని ప్రశ్నించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా విజయమ్మ నేతృత్వంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

తెలంగాణ బిల్లును అసెంబ్లీలో తీర్మానం కోసం పంపించే విధంగా చర్యలు చేపట్టాలని తాము రాష్ట్రపతిని కోరామని, ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. తాము సమైక్యాంధ్రకు మద్దతుగా జాతీయ పార్టీలను కూడగట్టేందుకు ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు. కాంగ్రెసు పార్టీ ఎవరిని సంప్రదించకుండా విభజన నిర్ణయం తీసుకుందన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఎందుకు దీక్ష చేస్తున్నారని ప్రశ్నించారు. త్వరగా రాష్ట్రాన్ని విభజించాలని దీక్ష చేస్తున్నారా చెప్పాలన్నారు. జగన్ దీక్ష విషయమై రాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారని చెప్పారు. జగన్ ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలని సూచించారన్నారు. షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడం వల్లే జగన్ ఢిల్లీ రాలేకపోయారని, అందుకే హైదరాబాదులో దీక్ష చేస్తున్నారని చెప్పారు.
జగన్ పార్టీ సభపై విచారణ
హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఈ నెల 19న తమ సభకు అనుమతించాలన్న పిటిషన్ పైన హైకోర్టు విచారణ జరిపింది. ఈ నెల 12వ తేదీలోగా అనుమతి పైన పిటిషనర్‌కు తెలియజేయాలని సెంట్రల్ జోన్ డిసిపికి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు దీక్ష చేస్తున్న వైయస్ జగన్ పల్స్ 72గా ఉందని, షుగర్ లెవల్స్ 54కు పడిపోయాయని డాక్టర్లు తెలిపారు. బిపి 120/90గా ఉందని, కీ టోన్స్ 4+ ఉన్నట్లు చెప్పారు. జగన్ దీక్షను విరమింప చేయాలని వైద్యులు పోలీసులకు సూచించారు.












Click it and Unblock the Notifications