ఏపీ మద్యం షాపులకు భారీ డిమాండ్-విదేశాల నుంచీ దరఖాస్తులు-నేడే డెడ్ లైన్..!
ఏపీలో మద్యం షాపులకు ఎక్కడా లేని డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రంలో కొత్త మద్యం విధానం అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం మద్యం షాపుల లైసెన్స్ ల కోసం టెండర్ దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ నెల 1న ప్రారంభించిన దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగియనుంది. అయితే ఆరంభంలో కాస్త మందకొడిగా సాగిన ఈ ప్రక్రియ చివరికి వచ్చే నాటికి భారీ డిమాండ్ తో ముగియబోతోంది. ఏపీ, ఇతర రాష్ట్రాలతో పాటు ఏకంగా విదేశాల నుంచే మద్యం షాపుల టెండర్లు వేస్తున్నారు.
నిన్న సాయంత్ర వరకూ అన్ని జిల్లాల నుంచి 65629 మద్యం షాపుల కోసం టెండర్ దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో విదేశాల నుంచి వచ్చిన దరఖాస్తులు కూడా ఉన్నట్లు ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ చైతన్య మురళి ప్రకటించారు. యూరప్, అమెరికా నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇందులో అమెరికా నుంచే 20 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. మద్యం షాపుల దరఖాస్తుల గడువు ఇవాళ్టితో ముగియనుండగా 14న వేలం నిర్వహిస్తారు.

వాస్తవానికి రాష్ట్రంలో మద్యం షాపుల లైసెన్స్ ల కోసం ఈ నెల 10 వరకే దరఖాస్తుల గడువు ఇచ్చారు. 11న మద్యం షాపుల టెండర్ల వేలం నిర్వహించి 12 నుంచి కొత్త విధానం అమల్లోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు తగినట్లుగానే నాలుగు రోజుల క్రితం వరకూ పరిమిత సంఖ్యలో మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. పలు చోట్ల అధికార కూటమి నేతలే సిండికేట్ గా మారి దరఖాస్తులు దాఖలు చేస్తున్నట్లు వార్తలు రావడంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దీంతో దరఖాస్తుల సంఖ్య పెరగడం ప్రారంభమైంది. అదే సమయంలో రెస్పాన్స్ చూసి ప్రభుత్వం కూడా అప్లికేషన్ల గడువు నేటి వరకూ పొడిగించింది. వేలం తేదీనీ 14కు మార్చింది.












Click it and Unblock the Notifications