టీ అడిగిన భర్తకు సరుకులు లేవని భార్య సమాధానం; సెల్ఫీ వీడియో తీసి భర్త ఆత్మహత్యాయత్నం
రోజురోజుకు సమాజంలో చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. భర్త తన మాట వినలేదని భార్యలు, భార్య చెప్పింది చేయలేదని భర్తలు చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చిన్న చిన్న మనస్పర్థలు తలెత్తే పరిష్కరించుకోవాల్సింది పోయి కఠిన నిర్ణయాలు తీసుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇక ఇదే కోవలో భార్య టీ పెట్టమంటే పెట్టి ఇవ్వలేదని భార్యపై అలిగిన వ్యక్తి చిన్న కారణానికే ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

టీ ఇమ్మన్న భర్త, టీ పొడి, పంచదార లేవన్న భార్య
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ముగ్గుళ్ళకు చెందిన 23 సంవత్సరాల మద్దా రామకృష్ణ, ఆశాజ్యోతి ఇద్దరు భార్యాభర్తలు. మంగళవారం నాడు తన భార్యను టీ ఇవ్వమని రామకృష్ణ అడిగాడు. దీంతో ఇంట్లో పంచదార, టీ పొడి లేవని భార్య సమాధానమిచ్చింది. టీ పెట్టమని అడిగితే సరుకులు లేవు అని సమాధానం చెప్పిన భార్య తీరుకు రామకృష్ణ అవమానంగా ఫీల్ అయ్యాడు. భార్య చెప్పిన సమాధానానికి తీవ్ర అసహనానికి గురైన రామకృష్ణ ఇంట్లో నుంచి వేగంగా బయటకు వెళ్ళిపోయాడు.

సెల్ఫీ వీడియో తీసి మరీ భర్త ఆత్మహత్యాయత్నం
సాయంత్రం అయినా రామకృష్ణ ఇంటికి రాకపోవడంతో భార్య కంగారు పడింది. ఇంతలో ఆమె ఫోన్ కు వాట్సాప్ వీడియో వచ్చింది. అందులో భర్త సెల్ఫీ వీడియో తీసి మరీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఆమె ఒక్కసారిగా ఖంగు తింది. పురుగుల మందు డబ్బా తీసుకున్న రామకృష్ణ సాయంత్రం వేళ రాపాక తూము వద్దకు వెళ్లి పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ వీడియోను కుటుంబ సభ్యులకు స్నేహితులకు ఫార్వర్డ్ చేశాడు. ఇదే క్రమంలో భార్యకు కూడా ఫార్వర్డ్ చేయడంతో ఆమె ఒక్కసారిగా ఆందోళనకు గురైంది.

ఆస్పత్రిలో చేర్చిన బంధువులు ... టీ కోసం సూసైడ్ యత్నం చెయ్యటంతో షాక్
భర్త ఎక్కడున్నాడో తెలుసుకొని గ్రామస్తులు సహాయంతో అక్కడికి వెళ్ళింది. రామకృష్ణ స్నేహితులు, భార్య పురుగుల మందు తాగి పొలం వద్ద పడివున్న రామకృష్ణ ను హుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రామకృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరీ ఇంత చిన్న విషయానికే ఆత్మహత్యాయత్నం చేసుకున్న రామకృష్ణ తీరుపై స్థానికులు చర్చించుకుంటున్నారు.

కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్న మానసిక నిపుణులు
భార్య ఇంట్లో సరుకులు లేవంటే సరుకులు తీసుకురావాల్సింది పోయి, భార్య చెప్పిన సమాధానానికి ఆత్మహత్యాయత్నం చేయడం ఏమిటని వారు చర్చించుకుంటున్నారు. ఇలా చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడాలనే ఆలోచనా ధోరణి పెరిగిపోతున్న నేటి రోజుల్లో ఈ ధోరణి అత్యంత ప్రమాదకరమని భావిస్తున్నారు. చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించుకోలేని మానసిక దౌర్భల్యం పెరిగిపోతున్న పరిస్థితులు అత్యంత ఆందోళనకరమని మానసిక నిపుణులు సైతం చెబుతున్నారు. ఇలాంటి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications