నేను ఎవరికీ భయపడను, మొండివాడ్ని: కెసిఆర్
హైదరాబాద్: తాను ఒక పని మొదలు పెడితే మధ్యలో వదిలే ప్రసక్తే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు. తాను మొండివాడినని, అనుకున్నది సాధించే వరకు నిద్రపోనని చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొంత స్థలం తీసుకుని పేదలకు ఇళ్లు కట్టిస్తానని స్పష్టం చేశారు.
గరీబోళ్లకు ఇళ్లు కట్టిస్తానంటే కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. విశ్వవిద్యాలయాల స్థలాలు అభివృద్ధికి తీసుకోవడంపై చెలరేగిన వివాదంపై ఆయన స్పందించారు. పేదలకు ఇళ్లు కడతానంటే తన దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పేదలకు ఇళ్లు కద్దవంటారా? అని ప్రశ్నించారు. పేదల జీవితాల్లో మార్పు రావడం కొందరికి ఇష్టం లేదని... దిష్టిబొమ్మలు తగలబెడుతున్న వారిని కొందరు నేతలు భుజానికి ఎత్తుకుంటున్నారని అన్నారు.

పేదలకు న్యాయం చేసే విషయంలో వెనక్కిపోయేది లేదని కెసిఆర్ స్పష్టం చేశారు. నిరుపేదలకు దశలవారీగా ఇళ్లు కట్టించి తీరుతామని తేల్చిచెప్పారు. ఇది రాజుల కాలం కాదని.. విశ్వవిద్యాలయాలకు వేలాది ఎకరాలు అవసరం లేదని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లో రేసు కోర్సులకు, గోల్ఫ్, పేకాట క్లబ్బులకు వందల ఎకరాలు భూములు ఇచ్చారని గుర్తు చేశారు. ఉద్యానవర్శిటీకి 50 ఎకరాలు సరిపోతాయని ప్రధానికి చెప్పినట్లు సిఎం కెసిఆర్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications