ఇంకా ఏం కావాలి, ఫ్యామిలీని జైలుకి పంపిస్తా: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ సాధించిన కీర్తి తనకు వేయి జన్మల వరకు చాలని, తెలంగాణను పాలించే బాధ్యత రావడం కంటే తనకు మరో ఆనందం ఏముందని అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం అన్నారు. ఇంతకుమించి తనకేం కావాలన్నారు. జానా రెడ్డి చెప్పినట్లుగా తెలంగాణ అభివృద్ధి కోసం నూతన ఒరవడి సృష్టించాలన్నారు. గతంలో తెలంగాణ కాంటెస్ట్‌లో ఏదీ జరగలేదన్నారు. ఇప్పుడు అన్నింటా తెలంగాణ కాంటెస్ట్‌లో జరగాల్సి ఉందన్నారు.
రాజకీయ అవినీతికి పాల్పడితే తన కుటుంబ సభ్యులను కూడా జైలుకు పంపిస్తానని చెప్పారు. తాము కచ్చితంగా బంగారు తెలంగాణ సాధించి తీరుతామన్నారు. తమకు గర్వం, బేషజాలు లేవన్నారు. తెలంగాణలో సృష్టించే ప్రతి ఒరవడిలో అందరం భాగస్వాములం అవుదామన్నారు. ఇప్పుడు సుఖశాంతుల తెలంగాణ కావాలన్నారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో ప్రాజెక్టులు కడతామని, చెరువులను ఉపయోగించుకుంటామని, నీటిని వ్యవసాయానికి ఉపయోగిస్తామని చెప్పారు.

అదిలాబాద్ జిల్లాలో మైనర్ ఇరిగేషన్, వరంగల్ జిల్లాలో రెండు ప్రాజెక్టులు, మహబూబ్ నగర్ జిల్లాలో జారాల - పాకాల చెరువు తవ్వడం చేస్తామన్నారు. ఓ జిల్లాలో ఎన్టీఆర్ వేసిన పునాదిరాయి ఇప్పటికీ తెలంగాణ ప్రజలను వెక్కిరిస్తోందన్నారు. ఒక తప్పు జరిగితే నాలుగు తరాలపై దాని ప్రభావం పడుతుందని, కాబట్టి తాను తప్పు చేయదల్చుకోలేదన్నారు. నాగార్జున డ్యాం కట్టడంలోనే మోసం జరిగిందని, గోదావరిలో అనేక మిగులు జలాలున్నాయని, కృష్ణాలో వాటా రావాల్సి ఉందన్నారు.
ఇప్పుడు ఏ పార్టీలు కూడా రాజకీయాలకు తావివ్వకూడదన్నారు. తెలంగాణ అభివృద్ధి ముఖ్యమన్నారు. రాజకీయాలకు ఇంకా ఐదేళ్ల సమయం ఉందన్నారు. కాబట్టి నాలుగో ఏడాది బ్లేమ్ గేమ్ చేద్దామన్నారు. జిహెచ్ఎంసీ, చిన్నా చితక ఎలక్షన్లు తప్ప వేరే లేవన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పినట్లు హైదరాబాదుకు నీరు రావాల్సిందే అన్నారు. షాద్ నగర్ నుండి కాలువ ద్వారా హైదరాబాదుకు నీటిని తెప్పించవచ్చన్నారు.












Click it and Unblock the Notifications