పవన్ పార్టీ పాలసీపై ఐడియా లేదు: చిరంజీవి, కిరణ్‌పై..
హైదరాబాద్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రూపొందిస్తున్నట్లు కేంద్రమంత్రి చిరంజీవి తెలిపారు. శనివారం ఆయన నివాసంలో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, మాజీ పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. అనంతరం చిరంజీవి మీడిమాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా కసరత్తు పూర్తికావచ్చిందని తెలిపారు.
రెండు రోజుల్లోగా అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని చిరంజీవి చెప్పారు. 80 శాతం వరకు ఎంపి, ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితా పూర్తయిందని ఆయన తెలిపారు. అభ్యర్థుల జాబితాలో యువతకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ఖరారైన అభ్యర్థుల జాబితాను శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ ముందు ఉంచే అవకాశం ఉంది.

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో యువత, రైతులు, మహిళలు, విద్యార్థులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు.
రైతులకు పగటి పూటే 9 గంటలపాటు విద్యుత్ సరఫరా అందించనున్నట్లు చిరంజీవి చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీమాంధ్రలోని ప్రతీ ఆడ బిడ్డకు 100 గజాల ఇంటి స్థలం ఇస్తామని చిరంజీవి తెలిపారు.
సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉందనడంలో వాస్తవం లేదని ఆయన అన్నారు. నాయకుల్లో లేని ఉత్సాహం కార్యకర్తలు కనిపిస్తోందని చెప్పారు. అభద్రతా భావం ఉన్న నాయకులు పార్టీని వీడినా.. కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారని చెప్పారు. జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి పార్టీని వీడటమే కాక, పార్టీకి తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. తన సోదరుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ విధానంపై తనకు అవగాహన లేదని చిరంజీవి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications