బిజెపిలో చేరేందుకు బొత్సషరతు? నటుడు సురేష్ ఎంట్రీ

సీమాంధ్ర పిసిసి కమిటీలో సరైన ప్రాధాన్యం దక్కటం లేదని బొత్స అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన కాషాయతీర్థం పుచ్చుకుంటారని జోరుగా వార్తలు వస్తున్నాయి. బొత్స తమ పార్టీ అగ్రనేతలతో సంప్రదింపులు జరిపినట్లుగా తమకు సమాచారం ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చెప్పారు.
బిజెపిలో చేరేందుకు బొత్స రంగం సిద్ధం చేసుకుంటున్నారని, ఆ పార్టీ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్‌తో లోపాయికారీగా మంతనాలు జరిపారని, త్వరలోనే నరేంద్ర మోడీతో భేటీకి కూడా సన్నద్ధమవుతున్నారంటూ టీవీల్లో స్క్రోలింగ్‌లు వచ్చాయి. దీంతో, విజయనగరం జిల్లాలో కలకలం రేగింది. ఈ కథనాలపై పార్టీలతోపాటు ప్రజలూ ఆసక్తికరంగా చర్చించుకున్నారు.
అదే సమయంలో బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా, బొత్స బిజెపిలోకి వస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై విలేకరులు ప్రశ్నించగా.. తమ పార్టీ జాతీయ నేతలతో సత్తిబాబు టచ్‌లో ఉన్నమాట వాస్తవమేనని వెల్లడించారు.
సినీ నటుడు మోహన్‌బాబు బీజేపీలోకి రావాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వల్ల ఆగిపోయారన్నారు. మరో నటుడు సురేశ్ బుధవారం బిజెపిలో చేరుతున్నట్లు వెల్లడించారు. టిడిపితో పొత్తు లేకుండా ఉంటే తనతోపాటు తన కుటుంబ సభ్యులు కూడా బిజెపిలో చేరతారని బొత్స చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు బిజెపి జాతీయ నేత వెంకయ్య నాయుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజులతో బొత్స టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు.
మరోవైపు, తనపై జరుగుతున్న ప్రచారాన్ని సత్తిబాబు ఖండించారు. తాను బిజెపితో టచ్‌లో లేనని, తనపై ఇప్పటి వరకు ఒక రకమైన కుట్ర జరిగిందని, బిజెపితో టచ్‌లో ఉన్నానంటూ ఇప్పుడు మరో రాజకీయ కుతంత్రం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ పిలుపు మేరకు సత్తిబాబు మంగళవారం ఢిల్లీ వెళ్లారు.












Click it and Unblock the Notifications