నేను సినిమా నటుడిని కాదు - సీఎంగా అడుగుపెట్టే వరకూ : చంద్రబాబు గేమ్ ఛేంజ్..!!
టీడీపీ అధినేత చంద్రబాబు గేమ్ ఛేంజ్ చేసారు. తనకు ఇవే చివరి ఎన్నికలంటూ చేసిన వ్యాఖ్యలతో జరిగిన చర్చతో కొత్త నినాదం మొదలు పెట్టారు. చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన కొనసాగుతోంది. ఎమ్మిగనూరు పర్యటనలో భారీగా జనస్పందన కనిపించింది. చంద్రబాబు వారిలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేసారు. అదే సమయంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. తొలి రోజు సభల్లో పవన్ కల్యాణ్ అంశం ప్రస్తావించిన చంద్రబాబు..ఈ ఎన్నికల్లో గెలిపిస్తే సరే, లేకుంటే ఇవే తన చివరి ఎన్నికలంటూ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు కొత్త గేమ్
దీని పైన రాజకీయం గా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తరువాత రోజు జరిగిన సభల్లో మాత్రం చంద్రబాబు ప్రసంగాల్లో మార్పు కనిపించింది. తాను సినిమా నటుడిని కాదని..తన సినిమా ఏదీ సూపర్ హిట్ కాలేదు..అయినా ఇంత స్పందన కనిపిస్తుందంటే తాను తిరిగి అధికారంలోకి వస్తే తప్ప భవిష్యత్తు లేదనే ఆలోచనతో సంఘీభావం చెప్పేందుకు వచ్చారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రోడ్ షోకు వచ్చిన జనాన్ని చూసి వైసీపీ పేటీఎం బ్యాచ్ కు కళ్లు బైర్లు కమ్ముతున్నాయని ఫైర్ అయ్యారు. అదే సమయంలో ముఖ్యమంత్రిని ఉద్దేశించి హెచ్చరిక చేసారు.

చంద్రబాబు సభలకు భారీ స్పందన
సీఎం మనుషులొచ్చి తన మీద గులకరాళ్లు వేస్తున్నారని..దీనికి ప్రజలు తిరుగుబాటు చేస్తే తాను బాధ్యుడిని కాదని చంద్రబాబు స్పష్టం చేసారు. తొలి రోజున చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా చంద్రబాబు రెండో రోజు ప్రసంగం సాగింది. తాను ముఖ్యమంత్రిగా అడుగుపెట్టేందుకు అందరూ సహకరించాలని చంద్రబాబు ప్రజలను కోరారు. బారీ జన స్పందన చూస్తుంటే ప్రభుత్వంపైన ఉన్న ఆగ్రహం స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. ఈ అసెంబ్లీ గౌరవ సభ కాదని.. కౌరవ సభగా చంద్రబాబు అభివర్ణించారు. ముఖ్యమంత్రిగానే ఆ సభలోకి అడుగు పెడతానని ధీమా వ్యక్తం చేసారు.
ముఖ్యమంత్రిగా అడుగుపెడతానంటూ
జనం కోసం జగన్ ఎప్పుడో ఒకసారి మాత్రమే బటన్ నొక్కుతున్నారని, కానీ, తాడేపల్లికి వచ్చే డబ్బుకోసం రోజూ బటన్ నొక్కుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. తమిళనాడులో గత ప్రభుత్వం అమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే, తరువాత ముఖ్యమంత్రి అయిన స్టాలిన్ వాటిని కొనసాగిస్తున్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేసారు.అధికారంలోకి వచ్చాక ప్రతీ మండలంలోనూ అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. మూడో రోజు పర్యటనలో భాగంగా జిల్లాలో నియోజకవర్గాల ఇంఛార్జ్ లతో చంద్రబాబు సమావేశం కానున్నారు.












Click it and Unblock the Notifications