'ముందస్తు' జరిగితే టీడీపీకి వచ్చే సీట్లు!!
గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి కేసీఆర్ విజయవంతమయ్యారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో ఎక్కువగా నానుతున్న అంశం ఏదైనా ఉందా? అంటే అది.. ముందస్తు ఎన్నికలపై చర్చ మాత్రమే. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలు జరగొచ్చంటూ సోషల్ మీడియాలో వార్తలు హోరెత్తిపోతున్నాయి. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ తమ ప్రభుత్వాలను రద్దుచేసి ముందస్తుకు వెళతారని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.

షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి!
గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి కేసీఆర్ విజయవంతమయ్యారు. ఈసారి కూడా అలాగే ముందస్తుకు ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ప్రతిపక్షాలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ కచ్చితంగా కేసీఆర్ ముందస్తుకు వెళతారని చెబుతున్నాయి. భారత రాష్ట్ర సమితి నాయకులు మాత్రం అదంతా ప్రచారమేనని,షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయంటున్నారు.

ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశం?
తెలంగాణ విషయం పక్కన పెడితే ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలపై తీవ్ర చర్చ నడుస్తోంది. అధికారంలో ఉన్న వైఎస్ జగన్ తన ప్రభుత్వాన్ని రద్దుచేసి ముందస్తుకు వెళతారని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. అంతేకాదు సమయం కూడా చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే లేదంటే డిసెంబరులో అసెంబ్లీని రద్దుచేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
పార్టీ శ్రేణులను ముందస్తు ఎన్నికలు వస్తే ఎదుర్కోవడానికి సమాయత్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన దాదాపు 157 అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష పూర్తిచేశారు. త్వరలోనే మిగతావి కూడా పూర్తిచేయనున్నారు. కొన్ని నియోజకవర్గాలకు వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను కూడా దాదాపు ఖరారు చేశారు.

ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమే
జనసేనతో పొత్తు కుదిరే నేపథ్యంలో ఆ పార్టీకి కేటాయించాల్సిన నియోజకవర్గాలను కూడా టీడీపీ సిద్ధం చేసింది. ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని, ఇంకా పూర్తిగా వ్యతిరేకత పెరగక ముందే జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్తారని టీడీపీ ప్రచారం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే వైసీపీ నాయకులు మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ మాత్రం ఖాయంగా ముందస్తు ఎన్నికలు వస్తాయని చెబుతున్నారు.
ముఖ్యమంత్రి జగన్ కేసుల్లో కూరుకుపోయారని, అవి తనను ముంచేయకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుంటున్నారని, ముందస్తుకు తాము రెడీగా ఉన్నామని, రేపు ఎన్నికలు జరిగినా టీడీపీకి 160 సీట్లు ఖాయమని, జగన్ మాదిరిగా 175 సీట్లు వస్తాయని అతిశయోక్తులు చెప్పుకోవడం తమకు అలవాటు లేదంటున్నారు. ముందుస్తు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని టీడీపీ ధీమాగా చెబుతోంది.












Click it and Unblock the Notifications