మళ్లీ జగన్ వస్తే ఎలా ? చంద్రబాబు ముందు కీలక ప్రశ్న..! జవాబు ఇదే..
ఏపీలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి 164 సీట్లతో ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, అప్పటికే అధికారంలో ఉన్న వైసీపీ కేవలం 11 సీట్లతో ఘోర పరాజయం పాలైంది. ఈ ఫలితం ఇప్పటికీ జగన్ సహా వైసీపీ నేతలెవరికీ జీర్ణం కావడం లేదు. అదే సమయంలో కూటమి గెలుపుతో సీఎం అయిన చంద్రబాబు కూడా ఓ క్లిష్టమైన పరిస్దితి ఎదుర్కొంటున్నారట. అదేంటంటే తిరిగి జగన్ వస్తే అనే ప్రశ్న ఆయనకు ప్రతీ చోటా ఎదురవుతోందట.
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ఇవాళ ముగింపు తర్వాత హైదరాబాద్ బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఓ కీలక విషయం వెల్లడించారు. తాను ఎక్కడి కి వెళ్లినా మళ్లీ జగన్ వస్తే ఎలా అనే ప్రశ్న ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అయితే దానికి డెవిల్ ను నియంత్రించామని, ఇకపై ఎవరికీ ఇబ్బంది ఉండదంటూ తాను సమాధానం ఇస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

వచ్చే ఐదేళ్లు రాష్ట్ర పునర్ నిర్మాణమే లక్ష్యంగా తాము పనిచేస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఐదేళ్ల జగన్ పాలన తర్వాత అమరావతిపై జనాకర్షణ తగ్గిందని, పునర్ నిర్మాణంతో తిరిగి వైభవం తెస్తామన్నారు. ముందుగా నిర్మాణంలో ఉన్న వాటికి ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేస్తామని, అనంతరం కొత్తవి చేపడతామన్నారు. అమరావతిలో అన్ని నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.
మరోవైపు నదుల అనుసంధానంతో గోదావరి నది నుంచే దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ నీరు ఇవ్వొచ్చని ఆయన తెలిపారు. అలాగే కేంద్రంలో అధికార భాగస్వామ్యంపై మాట్లాడుతూ .. పదవుల కోసం తాము ఒత్తిడి చేయలేదన్నారు. గతంలో వాజ్ పేయ్ హయాంలోనే ఏడు కేంద్రమంత్రులు ఇస్తామంటేనే తీసుకోలేదని, కేవలం స్పీకర్ పదవితో సరిపెట్టుకున్నట్లు తెలిపారు. ఇప్పుడూ రెండు పదవులతో సంతోషంగానే ఉన్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications