ఏపీలో ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు - వాతావరణ శాఖ తీవ్రహెచ్చరిక..!!
ఏపీలో పలు ప్రాంతాల్లో కుండపోత కురుస్తోంది. పలు ప్రాంతాల్లో వాగులు పొంగాయి. రహదారుల మీద వరద నీరు ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రమాదకర ప్రవాహాలకు అనేక గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. కాగా, రాగల 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు... ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అయింది.
ఫ్లాష్ ఫ్లడ్స్
ఏపీలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్ జారీ చేసింది. రాగల 24 గంటల్లో తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు మరియు యానాం ప్రాంతాలల్లో ఆకస్మిక వరదల ప్రమాద సూచికను భారత వాతావరణ శాఖ సూచిస్తోంది. మరోవైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రేపు బలపడి సుస్పష్ట అల్పపీడనంగా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య -వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాగల వారం పాటు కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

భారీ వర్షాలు
ఈ రోజు (గురువారం) శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, విజయనగరం, నంద్యాల, పల్నాడులకు ఎల్లో ఎలెర్ట్ జారీ చేసారు. గడిచిన 24 గంటల్లో ఏలూరులో 22 సెం.మీ, ముమ్మిడివరం 18, అమలాపురంలో 13 సెం.మీ అత్యధిక వర్షపాతం నమోదైంది. కళింగపట్నం, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో స్థానిక ప్రమాద సూచిక ఎగురవేసినట్టు చెప్పారు. వరద ముప్పుతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. అత్యవసర సహాయం కోసం 112, 1070 నెంబర్లు అందుబాటులోకి తెచ్చారు. ఇక.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీ భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
ప్రభుత్వం చర్యలు
ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ నుంచి 5.52 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో అధికారులు రెండో ప్రమాద స్థాయి హెచ్చరిక జారీ చేయనున్నట్లు వెల్లడించారు. అన్ని శాఖల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించినట్లు తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నదిలో ప్రయాణించడం, ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం ప్రమాదకరమని, అత్యవసర సహాయం కోసం 112, 1070 నంబర్లలో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications