Yellow Alert: ఈ జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వింత వాతావరణం నెలకొంది. ఒకవైపు భానుడు తన ప్రతాపం చూపిస్తుంటే, మరోవైపు వాతావరణ అనిశ్చితి వల్ల పలు జిల్లాల్లో వర్షాలు పలకరిస్తున్నాయి. నిన్నటి వరకు ఎండ వేడితో అల్లాడిన కోస్తా జిల్లాలకు వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు వ్యాపించి ఉన్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం మారింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ఆంధ్రతో పాటు రాయలసీమలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎల్లుండి (గురువారం) నాటికి వర్షాల తీవ్రత పెరిగి, అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

మన్యంలో వడగళ్ల వాన.. సీమలో నిప్పుల కుంపటి
సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టగా, ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. అయితే, రాయలసీమలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. సోమవారం అనంతపురంలో గరిష్ఠంగా 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై, రాష్ట్రంలోనే అత్యంత వేడి ప్రాంతంగా నిలిచింది.
తగ్గనున్న ఉష్ణోగ్రతలు
వరుసగా కురిసే వర్షాల కారణంగా ఎండల నుండి సామాన్యులకు కొంత ఊరట లభించనుంది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుండి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఎన్టీఆర్ మరియు పల్నాడు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, రైతులు తమ పంట కోతలపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications