చల్లని కబురు, ఈ జిల్లాల్లో మూడు రోజులు ఇక వర్షాలు..!!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పలు జిల్లాల్లో నమోదు అవుతున్నాయి. వడదెబ్బకు పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరో వైపు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.దీంతో ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. ఒక వైపు ఎండల తీవ్రత పైన హెచ్చరికలు సాగుతున్న సమయంలోనే మరో వైపు రానున్న మూడు రోజుల్లో పలు జిల్లాలకు వర్షాల పైన వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేసింది.
ఎండ తీవ్రత కొనసాగుతున్న సమయంలోనే... పలు జిల్లాలకు వర్షాలపైన హెచ్చరికలు జారీ అయ్యాయి. పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. నెల్లూరులో శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. గురువారం జిల్లా సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రత 44.1 డిగ్రీలు నమోదవగా శుక్రవారం 37.2 డిగ్రీలు నమోదైంది. అంటే ఒక్క రోజులో ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గింది. జిల్లాలో అత్యధికంగా సైదాపురంలో 42.8 డిగ్రీలు నమోదైంది. అనేకచోట్ల ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. చెట్లు నేలకూలాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అనంతపురం నగరం జలమయమైంది. రోడ్లపై వర్షపునీరు నిలి చి, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఆత్మకూరు మండలంలో అత్యధికంగా 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

మూడు రోజుల పాటు వర్షాలు
శ్రీసత్యసాయి జిల్లాలోని మొత్తం 32 మండలాల్లో గురువారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినన వర్షం కురిసింది. అమరాపురం మండలంలో అత్యధికంగా 4.92 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా.. ఈ రోజు, రేపు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో మెరుపులతో కూడిన ఉరుములు సంభవించే అవకాశం ఉంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని హెచ్చరించారు. దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా రాబోయే రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.













Click it and Unblock the Notifications