కత్తి మహేశ్ ప్రమాదం-మృతి : విచారణకు ప్రభుత్వ ఆదేశం : గతంలో దాడులతో లింకు ఉందంటూ..!!
సినీ క్రిటిక్..నటుడు కత్తి మహేష్ ప్రమాదం దగ్గర నుంచి మరణించిన సమయం వరకు జరిగిన ఘటనల పైన విచారణ మొదలైంది. కత్తి మహేష్ మృతిపై ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రమాదం పైన అనేక సందేహాలు ఉన్నాయన్నారు. గతంలో దాడులు.. కొన్ని సంఘటనలతో సంబంధం ఉందనే విధంగా సందేహం వ్యక్తం చేసారు.
కత్తి మహేష్ విజయవాడ నుంచి కారులో వెళ్తుండగా..నెల్లూరుకు 13కి.మీ దూరంలో ప్రమాదానికి గురైంది. డ్రైవింగ్ సీటులో సురేశ్ ఉండగా.. పక్క సీటులో కత్తి మహేష్ ఉన్నారు. అయితే, మహేష్ కూర్చున్న వైపే ప్రమాదం జరిగింది. సురేష్ కు మాత్రం ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో..తొలుత కత్తి మహేష ను నెల్లూరులో ఒక ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయన చికిత్స కోసం ఏపీ ప్రభుత్వం రూ 17 లక్షల ఆర్దిక సాయం అందించింది.

కత్తి మహేష్ కు కళ్లు దెబ్బతిన్నాయని..ఒక కంటిని తీసేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. అయితే, సడన్ గా ఆయన ఆరోగ్యం విషమించింది. ఆ తరువాత ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. కత్తి మహేష్ మరణం పైన తమకు అనుమానాలున్నాయని ఆయన తండ్రి ఓబులేషు చెప్పారు. మహేష్ చనిపోయిన విషయాన్ని తమకు చెప్పకుండానే బయటకు వెల్లడించారని ఆయన తెలిపారు. కత్తి మహేష్ మృతిపై న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేసారు. ప్రస్తుతం తన ఆరోగ్యం సహకరించడం లేదని వాపోయారు. అలాగే ఇప్పుడు న్యాయం కోసం పోరాడే పరిస్థితి లేదన్నారు.
దీంతో..ఈ మొత్తం వ్యవహారం పైన పోలీసులు విచారన ప్రారంభించారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవింగ్ సీట్లు ఉన్న సురేష్ ను పిలిపించిన పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో ఏం జరిగిందనే కోణంలో అన్ని వివరాలు సేకరిస్తున్నారు. అంత పెద్ద ప్రమాదం జరిగితే సురేష్ కు ఒక్క గాయం కూడా కాకపోవటం పైన అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆ కోణంలోనూ విచారణ చేస్తున్నారు.
ప్రమాదం జరిగిన తరువాత ఏం జరిగిందీ... అపోలో ఆస్పత్రిలో చికిత్స పైన పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లగా తెలుస్తోంది. నిజంగా ఆరోపణలు వస్తున్నట్లుగా ఏదైనా జరిగిందా..లేక, ప్రమాదమేనా అనేది విచారణలో తేలనుంది. గతంలో జరిగిన దాడుల అంశాన్ని ఇప్పుడు కత్తి మహేష్ సన్నిహతులు ప్రస్తావించటం ఇప్పుడు చర్చకు కారణమైంది.












Click it and Unblock the Notifications