బీజేపీ ఎంపీ స్పెషల్ ఫ్లైట్ లో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ జంప్ ? అసలేం జరిగిందంటే ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి, పోలీసులకు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఒకరు చుక్కలు చూపిస్తున్నారు. వైఎస్సార్ జిల్లాలో ఓ భూవివాదంలో చిక్కుకున్న ఆయన్ను పోలీసులు గాలిస్తుండగానే పరారయ్యారు. ఈ క్రమంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ ఎంపీ ఒకరు ఈ టీడీపీ మాజీ ఎమ్మెల్సీని క్షేమంగా తప్పించేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రభుత్వ వర్గాలు, పోలీసులు ఇంకా షాక్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
వైఎస్సార్ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి (మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి) తాజాగా స్ధానికంగా పులివెందుల చక్రాయపేటలో ఓ భూవివాదంలో చిక్కుకున్నారు. ప్రైవేట్ వ్యక్తుల రియల్ ఎస్టేట్ వెంచర్ ను ధ్వంసం చేసినట్లు పోలీసులు ఆయనతో పాటు మరో 30 మందిపై కేసు పెట్టారు. ఇందులో ఇప్పటికే 8 మందిని అరెస్టు కూడా చేశారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఇందులో భాగంగా బీటెక్ రవిని కూడా అరెస్టు చేసేందుకు గాలిస్తున్నారు.

బీటెక్ రవి కోసం పోలీసులు ముందుగా వైఎస్సార్ జిల్లాలో గాలించారు. కానీ ఆయన అప్పటికే తప్పించుకున్నారు. పులివెందుల నుంచి రహస్యంగా హైదరాబాద్ చేరుకున్న ఆయన.. ఆ తర్వాత చెన్నైకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసులు గాలిస్తున్న ఆయన గతంలో టీడీపీలో ఎంపీగా గెలిచి బీజేపీకి ఫిరాయించిన సీఎం రమేష్ సాయంతో తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
పులివెందుల పోలీసులు తన కోసం గాలిస్తుండటంతో హైదరాబాద్ వెళ్లిపోయిన బీటెక్ రవి.. అనంతరం అక్కడి నుంచి చెన్నైకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రోడ్డు మార్గంలో వెళ్తే తిరిగి ఏపీ పోలీసులకు దొరికే అవకాశం ఉండటంతో ఆయనకు గాడ్ ఫాదర్ గా భావించే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సాయంతో ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి చెన్నైకు వెళ్లిపోయారు. అదీ పేరు మార్చుకుని మరీ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిగా ఉన్న ఆయన పేరును ఎం. రవీందర్ గా చూపించి ఆయన చెన్నైకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications