వివేకా కేసులో మరో ట్విస్ట్-సీబీఐకి సాయం చేసేందుుక సునీతకు కోర్టు అనుమతి..
ఏపీలో తీవ్ర సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐకి పలు అవాంతరాలు ఎదురవుతుండటం, సీబీఐ దర్యాప్తుకు మద్దతుగా వివేకా కుమార్తె సునీతారెడ్డి పిటిషన్లు కూడా దాఖలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఆమె దాఖలు చేసిన ఓ పిటిషన్ పై విచారణ జరిపిన హైదరాబాద్ సీబీఐ కోర్టు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది.
వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐకి సహకరించేందుకు తనకు, తన న్యాయవాదులకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సునీతారెడ్డి హైదరాబాద్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఇవాళ అనుమతి మంజూరు చేస్తూ తీర్పు నిచ్చింది. సీబీఐ విచారణకు అవసరమైన సాయం అందించేందుకు సునీతారెడ్డికి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఇకపై సీబీఐతో కలిసి సునీత అధికారికంగా పనిచేసేందుకు అనుమతి దొరికినట్లయింది.

అయితే సునీతారెడ్డి పిటిషన్ పై తీర్పు ఇచ్చే సందర్భంలో సీబీఐ కోర్టు ఓ కీలక సూచన చేసింది. సీబీఐకి ఈ కేసు దర్యాప్తులో సునీతారెడ్డి, ఆమె న్యాయవాదులు అందించే సాయం సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా మాత్రమే ఉండాలని సూచించింది. దీన్ని ఉల్లంఘించినట్లు తేలితే భవిష్యత్తులో ఆమెకు ఇచ్చిన అనుమతిని రద్దు చేసేందుకు సీబీఐ కోర్టుకు అధికారం ఉంటుంది.
వివేకా కేసులో దర్యాప్తు పూర్తి చేసేందుకు సీబీఐకి సుప్రీంకోర్టు ఇప్పటికే ఈ నెల 30 వరకూ గడువు విధించింది. ఈలోపు దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నా ఆటంకాలు తప్పడం లేదు. ఈ తరుణంలో సునీతారెడ్డిని సాయం చేసేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications