andhra pradesh amaravati loans central govt ap govt letter ap news ఆంధ్రప్రదేశ్ అమరావతి అప్పులు రుణాలు కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం లేఖ
జగన్ సర్కార్‌కు కేంద్రం భారీ ఝలక్- ఇష్టారాజ్యం అప్పులకు చెక్- కొత్త పరిమితులివే
ఏపీలో రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు నవరత్నాల పేరిట తీసుకొచ్చిన భారీ సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర ఖజానా సహకరించే పరిస్ధితి లేదు. దీంతో ఏటికేడాది అప్పులను భారీ స్ధాయిలో పెంచుకుంటూ పోతున్న ప్రభుత్వం.. ఈ విషయంలో కేంద్రంతో పాటు ఆర్ధిక సంస్ధలు చెప్పినట్లు ఆడాల్సిన పరిస్ధితికి వచ్చేసింది. ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న మాటలు చూసినా ప్రజల సంక్షేమం కోసమే అప్పులు చేస్తున్నట్లు బహిరంగంగానే చెప్పుకునే పరిస్ధితి. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులతో పోల్చుకుంటూ తాము పరిమితి దాటడం లేదని కూడా చెబుతోంది. ఈ వాదనలన్నింటికీ చెక్ పెడుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
చంద్రబాబు, జగన్ ప్రధానులైనా హోదా రాదు- పుదుచ్చేరి వేరు- సుజనా కామెంట్స్

జగన్ సర్కార్‌కు కేంద్రం బిగ్ షాక్
రెండేళ్లుగా ఏపీలో ఆర్ధిక పరిస్ధితి అంతంతమాత్రంగా ఉన్నా అప్పులతో కాలం గడిపేస్తున్న వైసీపీ సర్కారుకు కేంద్రం బారీ ఝలక్ ఇచ్చింది. అప్పులపై ఆధారపడి ప్రభుత్వం నడపడం ఏంటన్న విమర్శలను లెక్క చేయకుండా ముందుకెళ్తున్న జగన్ సర్కార్ దూకుడుకు బ్రేకులు వేసింది. 15వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు తాజాగా నిర్ణయించిన రుణ పరిమితిని అమలు చేయాల్సిందేనని తాజాగా రాష్ట్ర ఆర్ధిక శాఖ కార్యదర్శికి కేంద్రం లేఖ రాసింది. దీంతో కేంద్రం చెప్పిన పరిమితి మేరకే రుణాలు తీసుకోవాల్సిన పరిస్ధితి ఎదురుకానుంది.

నికర రుణ పరిమితి రూ.42,472 కోట్లే
15వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు ఏ రాష్ట్రానికికైనా వారి స్ధూల జాతీయోత్పత్తిలో గతంలో తీసుకున్న అప్పును మినహాయిస్తే మిగిలిన దాంట్లో నాలుగు శాతం రుణాలు మాత్రమే తీసుకునే వెసులుబాటు కల్పించారు. కానీ రాష్ట్రాలు ఈ పరిమితి పట్టించుకోకుండా ముందుకెళ్తున్నాయి. దీంతో ఇప్పుడు 15వ ఆర్ధిక సంఘం సిఫార్సులు అమలు చేయాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ లెక్కన ఈ ఆర్ధిక సంవత్సరంలో ఏపీ స్ధూల జాతీయోత్పత్తి అంచనా అయిన రూ.10,61,802 కోట్లలో గత ఆర్ధిక సంవత్సరంలో తీసుకున్న రుణాలు మినహాయించి నాలుగు శాతం అంటే రూ.42,472 కోట్లను మాత్రమే రుణాలుగా తీసుకోవాలని కేంద్రం ఏపీ సర్కార్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట ఆర్ధికశాఖ కార్యదర్శికి కేంద్రం లేఖ రాసింది.

అన్ని అప్పులూ నికర రుణ పరిమితిలోకే
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో తీసుకుంటున్న అప్పుల నుంచి తీసుకుని, ఆర్ధిక సంస్ధల నుంచి తీసుకునేవి, పొదుపు మొత్తాల నుంచి తీసుకునేవి, విదేశీ ఆర్ధిక సాయం కింద కేంద్రం ఇచ్చే రుణాలు, ప్రావిడెంట్ ఫండ్లు, డిపాజిట్ల నిధులు, రిజరర్వు నిధులు అన్నీ కలిపినా కేంద్రం విధించిన నికర రుణ పరిమితి దాటకూడదని తాజా లేఖలో స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిమితి దాటి అప్పులు చేయలేని పరిస్ధితి తలెత్తబోతోంది. తాజా లెక్కల ప్రకారం అసలు రాష్ట్ర రుణ పరిస్ధితితో పాటు డిస్కంల వివరాలు పంపాలని, దీని ఆధారంగా ఈ అప్పులు తీసుకునేందుకు వెసులుబాటు ఇస్తామని చెబుతోంది.

పెట్టుబడి వ్యయం రూ.27,589 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే అప్పుల్లో తప్పనిసరిగా పెట్టుబడి వ్యయం చేయాల్సి ఉన్నా ప్రభుత్వాలు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. వివిధ రూపాల్లో తీసుకున్న అప్పులను మొత్తం సంక్షేమ పథకాలతో పాటు ఇతర అవసరాలకు వాడేస్తున్నాయి. దీంతో తాజాగా ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం ఏపీ ప్రభుత్వానికి పెట్టుబడి వ్యయం పరిమితిని కూడా పంపింది. ఈ లెక్కన చూస్తే ఈ ఆర్ధిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం రూ.27,589 కోట్లు పెట్టుబడి వ్యయం చేయాల్సిందేనని స్పష్టం చేసింది. గత ఆర్ధిక సంవత్సరాల్లో చేసిన వ్యయం ఆధారంగా ఈ పరిమితిని నిర్ణయించింది.

జగన్ కొత్త దారులు వెతుక్కోవాల్సిందేనా ?
ప్రస్తుతం కేంద్రం విధించిన నికర రుణ పరిమితి యథాతథంగా అమలు చేస్తే ఇప్పటికే చెల్లింపులకు ఎదురవుతున్న కష్టాలు రెట్టింపు కావడం ఖాయంగా కనిపిస్తోంది. అదీ అన్ని అప్పుల్నీ ఈ పద్దులోనే చేరుస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేయడం ప్రభుత్వానికి మింగుడు పడని పరిస్ధితి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తప్పనిసరిగా అదనపు ఆదాయ మార్గాలను వెతుక్కోక తప్పని పరిస్ధితి ఎదురు కాబోతోంది. మారిన పరిస్ధితుల్లో పన్నులు, సుంకాల పెంపు, ఇతరత్రా మార్గాల్లో ఆదాయం పెంచుకోలేకపోతే భవిష్యత్తులో సంక్షేమ పథకాల అమలుకు సైతం ఇబ్బందులు తప్పకపోవచ్చని నిఫుణులు చెప్తున్నారు.