ముందే వస్తున్న రుతుపవనాలు
వేసవిలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అసాధారణ స్థాయిలో ఎండలు ఉంటుండటంతో ప్రజలు మధ్యాహ్న వేళల్లో ఇంటినుంచి బయటకు రావడంలేదు. దేశవ్యాప్తంగా దాదాపు 45 డిగ్రీల చొప్పున నమోదవుతున్నాయి. ఏప్రిల్ మొదటివారం నుంచే ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో మే నెల వస్తే పరిస్థితి ఏమిటా? అనే ఆందోళనలో ప్రజలు ఉన్నారు. నిప్పుల కొలిమి లాంటి రాష్ట్రాన్ని తలచుకొని భయపడుతున్నారు. రాబోయే రోజుల్లో 47 నుంచి 49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పిల్లల ప్రాణాలకు ప్రమాదం పొంచివుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మంది చిన్నారుల ప్రాణాలకు ముప్పు పొంచివున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ విభాగం రుతుపవనాలకు సంబంధించి చల్లటి శుభవార్తను వినిపించింది. సమాయానికంటే ముందే రుతుపవనాలు ప్రవేశిస్తాయని అధికారులు వెల్లడించారు. హిందూ మహా సముద్రంలో డైపోల్, లానినా పరిస్థితులు చురుగ్గా మారడమే దీనికి కారణమని తెలిపారు. పసిఫిక్ లో లానినా ఏర్పడటానికి సానుకూల వాతావరణాన్ని ఏర్పాటుచేస్తున్నాయన్నారు.

హిందూ మహా సముద్రంపై సానుకూల దశను ఇవి సూచిస్తున్నాయని, దీనివల్ల జులై నుంచి సెప్టెంబరు వరకు గరిష్ట రుతుపవన పరిస్థితులు పెరగనున్నాయి. వాయువ్య భారత్, ఉత్తర అరేబియా, పశ్చిమ భారత్ ప్రాంతాల్లో అల్పపీడనాలు విస్తరించి వర్షాలను కురిపించనున్నాయి. వర్షపాతం పెరుగుదల ఉండనుంది.జూన్ నాటికి ఎల్‌నినో బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మే చివరకు ఎల్‌నినో మరింత బలహీనపడి, జూన్ కు తటస్థ పరిస్థితులు ఏర్పడతాయని, జులై నెలాఖరుకు నైరుతి రుతుపవనాల రెండో భాగంలో మంచి వర్షాలు కురుస్తాయని తెలిపారు.












Click it and Unblock the Notifications