పట్టాలెక్కుతున్న తొలి వందేభారత్ స్లీపర్, రూట్..ముహూర్తం ఫిక్స్ - ఇక ఈ మార్గంలో..!!
రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఎంతో కాలంగా వేచి చూస్తున్న వందేభారత్ స్లీపర్ పట్టాలు ఎక్కేందుకు ముహూర్తం ఖరారైంది. అధునాతన సౌకర్యాలు.. భద్రతా పరంగా పూర్తి సౌకర్యవంతం గా తీర్చి దిద్దిన మేకిన్ ఇండియా రైలుగా వందేభారత్ స్లీపర్ సిద్దమైంది. దశల వారీగా దేశ వ్యాప్తం గా విస్తరించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. తొలి విడతలోనే తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ స్లీపర్ ఖరారు కానుంది. ఈ మేరకు రైట్ సైతం ఆమోదించారు.
భారతీయ రైల్వే అధునాతన సౌకర్యాలతో రూపకల్పన చేసిన వందేభారత్ స్లీపర్ పట్టాలు ఎక్కేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. డిసెంబర్ 25న తొలి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించే లా నిర్ణయం దాదాపు ఫైనల్ అయింది. 2019లో వందే భారత్ రైలు ప్రారంభమైనప్పటి నుంచి.. ప్రయాణికుల నుంచి బాగా ఆదరణ లభిస్తోంది. దీంతో 100 వందే భారత్ రైళ్లను రైల్వే శాఖ నడుపుతోంది.

ఈ వందే భారత్ స్లీపర్ రైలు బెంగళూరులోని బీఈఎంఎల్ ఫ్యాక్టరీలో తయారైంది. ట్రయల్ రన్ కోసం డిసెంబర్ 12న నార్తర్న్ రైల్వేకు పంపనున్నారు. ఈ హైటెక్ రైలులో 16 కోచ్‌లు, 827 బెర్త్‌లు ఉంటాయి. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి.. కవచ్ భద్రతా వ్యవస్థతో తయారు చేశారు. రాత్రిపూట సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి హోటల్ లాంటి కంఫర్ట్ అందించనుంది.
కాగా, తొలి రైలు ఢిల్లీ - పాట్నా మధ్య నడిపేందుకు నిర్ణయించారు. అత్యాధునిక సౌకర్యాలు, భద్రతపై దృష్టి పెట్టి స్లీపర్ రైలును రూపొందించారు. ఆటోమేటిక్ డోర్లు, బయో టాయిలెట్లు, సీసీటీవీ కెమెరాలు, రీడింగ్ లైట్లు, ప్రీమియం ఇంటీరియర్‌లు ఏర్పాటు చేశారు. గంటకు గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఈ రైలును వారానికి 6 రోజులు నడిచే అవకాశం ఉంది. పట్నాలోని రాజేంద్ర నగర్ టెర్మినల్ నుంచి సాయంత్రం బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం ఢిల్లీ చేరుకోనుంది.
దశల వారీగా విస్తరించాలని డిసైడ్ అయ్యారు. తొలి విడతలోనే తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ స్లీపర్ దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ, విజయవాడ నుంచి అయోధ్య, విశాఖ నుంచి తిరుపతికి వందేభారత్ స్లీపర్ రైళ్ల కేటాయింపు పైన ప్రతిపాదనలు సిద్దంగా ఉన్నాయి. ముందుగా ఈ మూడు మార్గాల్లో ఒకటి ఖరారు కానుంది. వచ్చే వారం దీని పైన అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications