హోదాపై తేల్చేందుకు కేంద్రం రెడీ!, చంద్రబాబు ముందడుగు ఎలా ఉండబోతుంది?
హైదరాబాద్ : హోదానా..! ప్యాకేజీనా..! ఓవైపు పీఎం, మరోవైపు ఏపీ సీఎం ఇద్దరు విదేశీ పర్యటనల్లో ఉండడంతో కాస్తంతా బ్రేక్ పడ్డ ఈ అంశానికి రేపో మాపో కదలిక రాబోతుందన్న వార్తలు వెలువడుతున్నాయి. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు ఇద్దరు తమ విదేశీ పర్యటనలు ముగించుకుని వచ్చిన నేపథ్యంలో.. హోదా అంశంపై మళ్లీ చర్చ జరిగే అవకాశమున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.
విదేశీ పర్యటనతో సీఎం చంద్రబాబు కేంద్రానికి అందుబాటలో లేకపోవడంతో.. మూడు రోజులుగా హోదా చర్చలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం చంద్రబాబు అందుబాటులోనే ఉండడంతో.. ఆయన్ను పిలిపించుకుని హోదా అంశంపై చర్చించే యోచనలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తోంది.
తేల్చాల్సిన విషయాలివే :
తాజా జీఎస్టీ బిల్లు అమలుతో దేశవ్యాప్తంగా ఏకీక్రుత పన్నుల విధానం అమలులోకి రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏపీకి పారిశ్రామిక రాయితీలపై ఎలాంటి విధానాన్ని అవలంభించాలి.. రెవెన్యూ లోటును ఎలా భర్తీ చేయాలి.. నిధుల కేటాయింపులో అనుసరించాల్సిన వ్యూహాలేంటి వంటి అంశాలు ఇప్పుడు తేలాల్సి ఉంది.

జీఎస్టీ రావడంతో.. ప్రత్యేక కేటాయింపులు, మినహాయింపులు లాంటి వాటికి తావు ఇవ్వవద్దని కేంద్ర ఆర్థిక శాఖ బ్యూరో క్రాట్స్ పట్టుబడుతున్నారు. అయితే విభజన జరిగిన సందర్భంలో.. తెరపై జీఎస్టీ అంశం లేదు కాబట్టి ఇప్పుడు ఏపీ ప్రయోజనాలను జీఎస్టీతో ముడిపెట్టకూడదనేది ఏపీ వాదన. విభజన చట్టంలో పొందుపరిచిన మేరకు హామిలు అమలు చేయాల్సిందేనని ఏపీ ప్రభుత్వం పట్టుబడుతోంది.
ప్రత్యేక నిధి :
ఏపీలో పారిశ్రామిక రాయితీలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించని నేపథ్యంలో.. దాని స్థానంలో ఓ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఏటా దాదాపు రెండు నుంచి మూడు వందల కోట్ల రూపాయలను అందించాలనేది కేంద్రం ఆలోచనగా సమాచారం. అయితే ఈ నిధికి సంబంధించిన కేటాయింపులపై ఇంతవరకు స్పష్టత లేదు.
ఇక రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు ఏటా రూ.2800కోట్లను రాష్ట్రానికి కేంద్రం ఇవ్వబోతుందనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఇవన్నీ కేవలం కేంద్రం అంచనాలు మాత్రమే అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతుండడంతో.. వీటిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఇదే విషయంపై చర్చించడానికి సీఎం చంద్రబాబుతో సంప్రదింపులు జరుపుదామని కేంద్రం యోచిస్తుంటే.. చంద్రబాబు మాత్రం హోదా తప్ప ఏదిచ్చినా తీసుకునే ప్రసక్తే లేదని చెబుతున్నారు. దీంతో ఈ విషయంలో ఎలాంటి ముందడుగు పడుతుందనేది ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.












Click it and Unblock the Notifications