స్ధానిక కోడ్ అమల్లో ఉండగానే సమీక్షలు: సీఎం జగన్ లైట్ తీసుకుంటున్నారా?
ఏపీలో పేరుకు స్ధానిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కానీ అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు యథావిథిగా కొనసాగుతున్నాయి. ఓసారి కోడ్ అమల్లోకి వచ్చినట్లు ఎన్నికల సంఘం ప్రకటించాక అధికారులెవరూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలు లేదు. కానీ ఇవాళ సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యపై నిర్వహించిన సమీక్ష చూస్తుంటే కోడ్ అమల్లో ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

స్ధానిక ఎన్నికల కోడ్ అమలవుతోందా ?
ఏపీలో స్ధానిక ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే సీఎం జగన్ ఇవాళ తన క్యాంపు కార్యాలయం వేదికగా అధికారులతో ఉన్నతస్ధాయి సమీక్ష నిర్వహించారు. ఉన్నత విద్యపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ తో పాటు హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ కె హేమచంద్రారెడ్డి, హయ్యర్ ఎడ్యుకేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర కూడా పాల్గొనడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. కోడ్ అమల్లో ఉండగా సమీక్షలు నిర్వహించడం ఓ ఎత్తయితే అభ్యంతరాలు చెప్పకుండా అధికారులు కూడా పాల్గొనడం చూస్తుంటే కోడ్ ను ప్రభుత్వం లైట్ తీసుకుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్నికల కోడ్ ఏం చెబుతోంది ?
స్ధానిక ఎన్నికలైనా, సార్వత్రిక ఎన్నికలైనా ఓసారి కోడ్ అమల్లోకి వస్తే ప్రభుత్వం రాష్ట్ర స్ధాయిలో ఎలాంటి అధికారిక కార్యక్రమాలు నిర్వహించకూడదు. కొత్త పథకాలు ప్రకటించకూడదు. ఉన్న పథకాల లబ్దిదారులకు సైతం పంపిణీలు చేయకూడదు. అధికారిక సమీక్షలైతే పూర్తిగా నిరోధించాలి. కానీ ప్రస్తుతం ఏం జరుగుతోంది. ఇవాళ సీఎం జగన్ నివాసంలో జరిగిన సమీక్షలో ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ కాలేజీ ఫీజులపై సీఎం ముందు ప్రతిపాదనలు ఉంచడం, వాటిపై సీఎం సమీక్షించడం చకచకా జరిగిపోయాయి.

అధికారికంగా సూచనలు, సలహాలు
కోడ్ అమల్లో ఉన్న తరుణంలో సీఎం సమీక్షలు నిర్వహించడమే సరికాదు అలాంటిది ప్రభుత్వ విధానాలపై అధికారులకు తగు సూచనలు, సలహాలు కూడా ఇచ్చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే ఎన్నికల కోడ్ కూ అధికారిక కార్యక్రమాలకు సంబంధం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. ఇవాళ సీఎం ఉన్నత విద్యపై సమీక్ష నేపథ్యంలో అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇందులో సీఎం మాట్లాడుతూ ..
మంచి చదువులు పిల్లలకు భారం కాకూడదని, అలాగే ప్రభుత్వానికి కూడా భారం కాకూడదన్నారు. మనం రూపొందించుకునే విధానాలు.. దీర్ఘకాలం అమలు కావాలని, ఫీజు రియింబర్స్‌మెంట్ ఎప్పటికప్పుడు చెల్లింపునకు సిద్ధంగా ఉన్నామని అధికారులకు సీఎం తెలిపారు. గత ఏడాది బకాయిలతోపాటు ఈ ఏడాది మూడు త్రైమాసికాలకు సంబంధించి, ప్రభుత్వం తరఫున చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులకు జగన్ స్పష్టం చేశారు.
మార్చి 30 కల్లా చెల్లింపులు చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు. త్రైమాసికం పూర్తికాగానే ఫీజు రీయంబర్స్‌మెంట్ చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎప్పటికప్పుడు చెల్లింపుల వల్ల కాలేజీలకూ మంచి జరుగుతుందని జగన్ తెలిపారు.

ఎన్నికల కమిషన్ ఏం చేస్తోంది ?
రాష్ట్ర స్ధాయితో పాటు జిల్లా, మండల స్ధాయిలోనూ ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుంది కాబట్టి అధికారులు కానీ రాజకీయ నేతలు కానీ ఉద్దేశపూర్వకంగా కోడ్ ఉల్లంఘించే పరిస్ధితి ఉన్నప్పుడు ఎన్నికల సంఘం అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తారు. అప్పటికీ వినకుండా ముుందుకుపోతే నోటీసులు ఇస్తారు. వాటికి సంతృప్తికరమైన సమాధానం రాకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించి చర్యలకు ఉపక్రమిస్తారు. అయితే ప్రస్తుతం సీఎం సమీక్షలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications