టీ టీమ్ అవుట్: కిరణ్ రెడ్డి వైయస్ స్టైల్ ఫెయిల్?
హైదరాబాద్: తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ రాజశేఖర రెడ్డి వ్యూహాన్ని అనుసరించారు. తెలంగాణలో తన సొంత జట్టును ఏర్పాటు చేసుకుని తెలంగాణ వాదాన్ని వినిపించే నాయకులకు ఎప్పటికప్పుడు కౌంటర్ వేస్తూ వైయస్ రాజశేఖర రెడ్డి ముందుకు సాగారు. ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వైయస్ రాజశేఖర రెడ్డి వ్యూహరచనలో, దాని అమలులో ఉక్కిరిబిక్కిరి అయింది. అయితే, వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు గురించి తెరాస నాయకులు, కాంగ్రెసులోని తెలంగాణవాదులు మాట్లాడుతుంటే తెలంగాణలోని వైయస్ రాజశేఖర రెడ్డి వర్గం అభివృద్ధి గురించి మాట్లాడుతూ వచ్చింది. తమకు అభివృద్ధి చెందిన తెలంగాణ మాత్రమే కావాలని వారు డిమాండ్ చేస్తూ వచ్చారు. కాంగ్రెసు అధిష్టానం వద్ద కూడా తెలంగాణవాదులకు ఎప్పటికప్పుడు ఆ జట్టు కౌంటర్ వేస్తూ పోయింది.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కూడా అదే వ్యూహాన్ని అనుసరించడానికి ప్రయత్నించారు. తెలంగాణలో తనకంటూ ఓ జట్టును ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేశారు. నిజానికి, ఆయన వ్యూహం ఫలించినట్లే అనిపించింది. తెలంగాణకు చెందిన జూనియర్ మంత్రులకు ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణవాదం విషయంలో కూడా వారి మద్దతును సంపాదించుకోవడానికి ప్రయత్నించారు. శ్రీధర్ బాబు, సునీతా లక్ష్మారెడ్డి, డికె అరుణ వంటి పలువురు మంత్రులు కిరణ్ కుమార్ రెడ్డికి చాలా కాలం సహకరిస్తూ వచ్చారు.
కానీ, తనకు పూర్తిగా సహకరిస్తారని భావించిన డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఎదురు తిరిగారు. ఇది కిరణ్ కుమార్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) నిర్ణయం తీసుకున్న తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వెంట సంగారెడ్డి ఎమ్మెల్యే తప్ప తెలంగాణకు చెందినవారెవరూ నడవడం లేదు.
ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడని భావించిన శ్రీధర్ బాబు కూడా కిరణ్ కుమార్ రెడ్డిని తప్పు పట్టడానికి వెనకాడడం లేదు. చివరి బంతి వరకు విభజనకు వ్యతిరేకంగా పోరాడుతామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటనపై శ్రీధర్ బాబు తీవ్రంగా ప్రతిస్పందించారు. ఆటే ముగిసిపోయిందని, ఇక బంతులు వేసే పని కూడా లేదని శ్రీధర్ బాబు అన్నారు. అట ముగిసి తర్వాత మళ్లీ ఆట ఉండదని ఆయన అన్నారు.

సునీతా లక్ష్మారెడ్డి, డికె అరుణ, జె. గీతారెడ్డి తదితర మంత్రులు కూడా తెలంగాణకు అనుకూలంగా ముఖ్యమంత్రిని బేఖాతరు చేయడానికి సిద్ధపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు భావిస్తున్నారు. మొత్తం మీద, తెలంగాణలో కిరణ్ కుమార్ రెడ్డి ఒంటరివారు అయిపోయినట్లే కనిపిస్తున్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వాదనను తోసిరాజంటూ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతోనే తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకులు తమ వైఖరి మార్చుకున్నారు. ముఖ్యమంత్రికి దూరం జరుగుతూ తెలంగాణకు పూర్తి స్థాయిలో అనుకూలంగా వ్యవహరించడానికి సిద్ధపడ్డారు.












Click it and Unblock the Notifications