కడప ట్విస్ట్: షర్మిల, జగన్ మధ్య దూరం పెరిగిందా?

జగన్ బెయిల్ పైన బయటకు వచ్చాక ఇరువురి మధ్య గ్యాప్ పెరిగినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. జగన్ ఆస్తుల కేసులో దాదాపు పద్దెనిమిది నెలలు జైలులో ఉన్నారు. ఈ సమయంలో పార్టీని కాపాడుకునేందుకు వైయస్ జగన్ తన సోదరి షర్మిలను రంగంలోకి దించారు. ఆమె రాష్ట్రవ్యాప్తంగా మరో ప్రజా ప్రస్థానం పేరిట పర్యటించారు. అంతకుముందు ఉప ఎన్నికలలో జోరుగా ప్రచారం చేశారు. క్రియాశీలకంగా ఉండటం ద్వారా ఆమె పార్టీలో ఎదిగారు.
ఆమె కడప పార్లమెంటు టిక్కెట్‌ను ఆశిస్తున్నారని ఎప్పటి నుండో ప్రచారం సాగుతోంది. దీనిని ఆ పార్టీ ఇప్పటికే అవినాష్ రెడ్డికి ఇస్తున్నట్లు ప్రకటించింది. కడప పైన ఆశలు పెట్టుకున్న షర్మిల అసంతృప్తితో ఉన్నారట. మరోవైపు పార్టీ మాత్రం ఆమె ఎలాంటి అసంతృప్తితో లేరని గతంలోనే ప్రకటించారు.
ఈ నేపథ్యంలో జగన్ జైలు నుండి విడుదలయ్యాక రెండుసార్లు ఇడుపులపాయకు రావడం షర్మిల వెంట రాకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకుమించి షర్మిల రెండు రోజుల క్రితం ఒంటరిగా ఇడుపులపాయకు వచ్చి నివాళులు అర్పించడం చర్చనీయాంశమైంది.
కోర్టు అనుమతి మేరకు జగన్ శని, ఆదివారాల్లో కడప జిల్లాలో పర్యటించారు. అప్పుడు ఆయన వెంట సోదరి లేరు. ఆయన కడప జిల్లా పర్యటన పూర్తయ్యాక షర్మిల ఒంటరిగా ఇడుపులపాయలో నివాళులు అర్పించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. టిక్కెట్ విషయంలో ఏమైనా దూరం పెరిగిందా అనే చర్చ సాగుతోంది. షర్మిల జిల్లాకు వచ్చినప్పుడు గతంలో క్యాడర్ ఘన స్వాగతం పలికేదని, ఇప్పుడు అది కనిపించలేదంటున్నారు.












Click it and Unblock the Notifications