అంతకు మించి ఆప్షన్ లేదుకదా?
జనసేనాని పవన్ కల్యాణ్ 2029 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా నెగ్గి అధికారం చేపట్టాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఆ లక్ష్య సాధనలో భాగమే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీచేయడం. భారతీయ జనతాపార్టీకి ఏపీలో ఒక శాతం కూడా ఓటుబ్యాంకు లేదు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీచేయడంవల్ల ఎటువంటి ప్రయోజనం లేదనే నిర్ణయానికి జనసేనాని వచ్చారు.

అధిష్టానానికి సమాచారం ఇచ్చిన ఏపీ బీజేపీ నేతలు
తెలుగుదేశం పార్టీతోపాటు బీజేపీని కూడా కలుపుకొని పొత్తులకు వెళ్లాలనేది పవన్ యోచనగా ఉంది. అందుకోసం ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో బీజేపీతో వివాదానికి దిగిన టీడీపీతో పొత్తుకు వెళ్లాలా? లేదా? అనే మీమాంసలో బీజేపీ ఉంది. బీజేపీ కలిసివచ్చినా, రాకపోయినా చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ వెళ్లడం ఖాయం. ఈ విషయాన్ని గమనించిన ఏపీ బీజేపీ నేతలు అధిష్టానానికి సమాచారం ఇచ్చారు. విశాఖపట్నం పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ పవన్ ను పిలిపించి మాట్లాడారు.

స్వరాన్ని మార్చిన పవన్ కల్యాణ్
మోడీని కలిసిన తర్వాత తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరిన పవన్ తన స్వరాన్ని మార్చుకున్నారు. మళ్లీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ప్రకటించారు. టీడీపీతో కలిసివెళ్లి పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను జనసేన తరఫున అసెంబ్లీకి పంపించడంతోపాటు తాను కూడా అసెంబ్లీలో అడుగుపెట్టాలనే పట్టుదలతో ఉన్నారు. టీడీపీతో జనసేన కలవకుండా ఉండాలని వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ ను ఒంటరిగా పోటీకి దిగాలంటూ రెచ్చగొడుతున్నారు. ప్రత్యర్థి పార్టీ వ్యూహాన్ని అర్థం చేసుకున్న జనసేనాని ఆ విషయంలో సంయమనం పాటిస్తూ పరిణితి చెందిన రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నారు.

కాపునేతల ద్వారా ఏపీలోకి బీఆర్ఎస్
మరోవైపు ఏపీలోకి కాపు నేతలద్వారా అడుగుపెడుతున్న బీఆర్ఎస్.. టీడీపీ-జనసేన ఓటుబ్యాంకుపై గురిపెట్టిందంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ తో సఖ్యతగా ఉండటమేకాకుండా ఆ పార్టీల నేతలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పవన్ మద్దతు ప్రకటించారు. ఆ సమయంలో తెలంగాణ బీజేపీతో పొత్తున్నప్పటికీ ఆయన వెనుకాడలేదు. కానీ ఏపీలో తమ ఓటుబ్యాంకుకే కేసీఆర్ గురిపెట్టడంతో జనసేనాని ఆలోచనలో పడ్డారు. బీజేపీ కలిసి వచ్చినా రాకపోయినా టీడీపీతో వెళ్లి కొంతమంది ఎమ్మెల్యేలను సాధించాలనుకుంటున్నారు. వీరిద్వారా ప్రజలకు దగ్గరై 2029 ఎన్నికల్లో ఓంటరిపోటీకి సిద్ధమవుతున్నారు. జనసేనాని ఆలోచనలకు అనుగుణంగా రాజకీయం నడుస్తుందా? లేదా? అనేదానికి కాలమే సమాధానం చెప్పబోతోంది.












Click it and Unblock the Notifications