నిద్రలో కేసీఆర్: బాబు, ఓడితేనే ఇలా: జగన్‌పై లోకేష్
హైదరాబాద్/నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. కేసీఆర్ తెలంగాణలో కరెంట్ సమస్యను పరిష్కరించకుండా నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు తాము యూనిట్‌కు రూ.5.50 ఇచ్చి కొన్నామని, తద్వారా ఏపీలో విద్యుత్ సంక్షోభం నుండి విముక్తి కలిగించామన్నారు. కేసీఆర్ మాత్రం విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యేలను లాక్కోవడమే కాకుండా.. తమ పైన విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవూరులో ఏర్పాటు చేసిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నెల్లూరు జిల్లాను కరవు రహిత జిల్లాగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. హైదరాబాదును అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత తమదే అన్నారు.

హైదరాబాదులో మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సు జరిగిందని, ఆ సదస్సు జరిగిన కన్వెన్షన్‌ను తానే కట్టించానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏపీకి అన్యాయం చేసిందన్నారు. కాంగ్రెస్ చేసిన దుర్మార్గం వల్లనే మనకు నష్టం జరిగిందన్నారు. ఏపీ బాగుపడాలంటే చంద్రబాబు వల్లనే సాధ్యమని భావించి.. ప్రజలు టీడీపీని గెలిపించారన్నారు.
ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని చెప్పారు. ఈ నెలలోనే 20 శాతం రుణాలు ఇస్తామని చెప్పారు. ఆర్బీఐ సహకరించక పోయినప్పటికీ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో నెల్లూరు ప్రజల మెప్పు పొందుతామన్నారు.
జగన్ పైన రావెల ఆగ్రహం
అవినీతి, అసాంఘిక కార్యక్రమాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మారిందని మంత్రి రావెల కిషోర్ కడపలో మండిపడ్డారు. సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీ గొడవల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వర్గం దాడులు చేసి నెపం టీడీపీపై నెడుతోందన్నారు. రాష్ట్రంలో పేదలకు సెంటుభూమి లేకుండా చేసి 16 లక్షల ఎకరాలను వైయస్ తన అనుచరులకు పంచిపెట్టారన్నారు. కేసీఆర్ అభివృద్ధి పనుల్లో పోటీపడాలని, కేసీఆర్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తూ ప్రాంతీయ నాయకుల మధ్య చిచ్చు పెట్టొద్దన్నారు.
సరస్వతి యాజమాన్యం దౌర్జన్యాన్ని సహించే ప్రసక్తి లేదన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు గూండాలను వేసుకొని రైతుల పైన దౌర్జన్యం చేశారని, వారందరినీ పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారన్నారు. ప్రజలకు మేలు చేసేందుకు చంద్రబాబు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. ఇది ఓర్వలేని నేతలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారన్నారు.
కాగా, రెండు రోజుల క్రితం లోకేష్ .. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ట్వీట్ చేశారు. జగన్, ఆయన పార్టీ కార్యకర్తలు ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో.. ఒత్తిడికి లోనై, దానిని రైతుల పైన చూపిస్తున్నారన్నారు. ఓడిపోతేనే వారి తీరు ఇలా ఉంటే.. అదే గెలిస్తే ఎలా ఉండేదో ఊహించుకోవాలన్నారు. వారి తీరు అరాచకంగా ఉందని, చట్ట వ్యతిరేకంగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications