చంద్రబాబుపై జగన్ వార్: మాటలపోరు అదుపు తప్పుతోందా?
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టిన సమరం మాటల యుద్ధంతో అదుపు తప్పుతున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబును చెప్పుతో కొట్టాలని ఆయన అనంతపురం జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్య దుమారం రేపుతోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనపై అంతకన్నా తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడుతున్నారు.
తన వ్యాఖ్యలను జగన్ వెనక్కి తీసుకోకపోగా అలా అనడంలో తప్పేముందని సమర్థించుకున్నారు. ఆ తర్వాత కూడా అదే స్థాయిలో ఆయన చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు తోలు మందమని వ్యాఖ్యానించారు. మాటల యుద్ధంలో ఇరు వర్గాలు కూడా వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. జైలుకు వెళ్లి వచ్చినా జగన్‌కు సిగ్గు లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంత్రులూ టిడిపి నాయకులూ తీవ్రమైన పదజాలంతో జగన్‌ను దూషిస్తున్నారు.

శుక్రవారంనాడు మంత్రులు, టిడిపి నేతలు వరుస పెట్టి జగన్‌పై విరుచుకుపడ్డారు. అదే స్థాయిలో శనివారంనాడు కూడా టిడిపి నాయకులు ఆయనపై రెచ్చిపోయారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆనం వివేకానంద రెడ్డి తనదైన శైలిలో జగన్‌పై దుమ్మెత్తిపోశారు. పిచ్చికుక్కను ఊరిమీదకు వదిలేసినట్లు జగన్ ప్రవర్తిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పిచ్చికుక్క దారికి రాకపోతే ఏం చేస్తామని ప్రశ్నిస్తూ... కాల్చి పడేస్తామని అన్నారు. జగన్ ప్రవర్తనతో తెలుగువారందరికీ చెడ్డపేరు వస్తోందని ఆయన అన్నారు. జగన్‌ని మళ్ళీ రాజకీయాల్లోకి అడుగుపెట్టనివ్వకూడదని ప్రజలకు పిలుపునిచ్చారు.
చంద్రబాబుపై వైయస్ రాజశేఖర రెడ్డి కూడా జగన్ మాదిరిగా తిట్టిపోయలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి టిడిపిలోకి మారిన శానససభ్యుడు జలీల్ ఖాన్ అన్నారు. చంద్రబాబుపై జగన్ హత్యాయత్నానికి కుట్ర చేస్తున్నారా అనే అనుమానాలను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బుచ్చయ్య చౌదరి వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఓ ఉన్మాది అని మరో మంత్రి మృణాళిని ఆరోపించారు. జగన్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. జగన్ ఒళ్లు దగ్గరు పెట్టుకుని మాట్లాడాలని మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు.












Click it and Unblock the Notifications