వాలంటీర్లు, సచివాలయాలపై జగన్ కీలక నిర్ణయం- ఆందోళనల నేపథ్యంలోనే
ఏపీలో దాదాపు 2.7 లక్షలమంది గ్రామ, వార్డు వాలంటీర్లు, మరో లక్షా పాతిక వేల సచివాలయాల సిబ్బంది విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లు తమ జీతాలను 12 వేలకు పెంచాలని ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో వారినుద్దేశించి బహిరంగ లేఖ రాసిన సీఎం జగన్.. మరో కీలక నిర్ణయం తీసుకోవడం ద్వారా ఉద్యోగ భద్రత కల్పించినట్లు తెలుస్తోంది.
ఏపీలో గ్రామ, వార్డు వాలంటీర్లతో పాటు సచివాలయ సిబ్బంది కోసం ప్రత్యేకంగా కమిషనరేట్‌తో పాటు విభాగాధిపతి(హెచ్‌వోడీ)ని కూడా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఇకపై వీరంతా సచివాలయాల శాఖ పరిధిలోనే ప్రత్యేక కమిషనరేట్ కింద పనిచేస్తారు. వీరికి హెచ్‌వోడీగా ప్రత్యేక కమిషనర్‌ను కూడా నియమిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది.
తాజా ఆదేశాల ప్రకారం ఇకపై వీరి ఆర్ధిక వ్యవహారాలు చూసేందుకు ఈ కమిషనరేట్ పనిచేయనుంది.

ఏపీ గ్రామ,వార్డు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల కోసం ప్రత్యేక కమిషనరేట్, హెచ్‌వోడీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన ప్రభుత్వం, ఈ మేరకు ఏపీ ఫైనాన్షియల్ కోడ్‌లో సవరణలు కూడా చేసింది. దీంతో గ్రామ వార్డు సచివాలయాల, వాలంటీర్ల విభాగానికి కమిషనరేట్ కార్యాలయం హెచ్‌వోడీగా పనిచేయనుంది. ఇకపై ఆయా ఉద్యోగులకు సంబంధించిన జీతాలు, వేతనాలు వంటి అంశాలన్ని ఈ కమిషనరేట్ పరిధిలోకి వెళ్లనున్నాయి. ఆర్ధిక భద్రతపై వాలంటీర్ల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.