రాష్ట్రంలో రానున్న రోజుల్లో జరిగేది ఇదే - జగన్..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి చంద్రబాబు పాలన పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలల పాలన పైన ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ ప్రవేశ పెట్టలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు. అధికార దుర్వినియోగం తీవ్రంగా ఉందని... రానున్న రోజుల్లో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని జగన్ చెప్పుకొచ్చారు..
పశ్చిమగోదావరి జిల్లా పార్టీ నేతలతో జగన్ సమావేశం అయ్యారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా బడ్జెట్ ప్రవేశపెట్టలేదని.. బడ్జెట్ ప్రతిపాదిస్తే హామీలకు ఎంత కేటాయించాలో చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అది చెప్పలేకనే బడ్జెట్ ను ప్రవేశ పెట్టలేదని వివరించారు. వైసిపి హయాంలో ప్రతి ఏటా సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసామని గుర్తు చేశారు. ఏ పథకానికి ఎంత బడ్జెట్ కేటాయింపుల్లో స్పష్టంగా చెప్పామని వివరించారు.

క్యాలెండర్ ప్రకారం సంక్షేమ నిధులను విడుదల చేసి అండగా నిలిచామని జగన్ పేర్కొన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదన్నారు. నాటి వైసిపి, నేటి పాలనకు మధ్య తేడాను ప్రజలు గమనించారని చెప్పారు. ఎవరి పాలనలో తమకు మేలు జరిగిందో జనం అర్థం చేసుకుంటున్నారని వివరించారు. చంద్రబాబు అబద్ధాలు మోసాలుగా మారుతున్నాయని ద్వజమెత్తారు.
చంద్రబాబు అబద్ధాలు ఇప్పుడు మోసాలుగా మారుతున్నాయి అన్నారు. ఆరోగ్యశ్రీ అటకెక్కిందని, రైతులకు పెట్టుబడి సాయం కూడా పోయిందని జగన్ పేర్కొన్నారు. వైసిపి హాయం కంటే ప్రస్తుతం ఇసుక రేటు అధికంగా ఉందని చెప్పారు. ప్రభుత్వానికి ఇసుక ద్వారా ఒక్క పైసా కూడా రావటం లేదన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మధ్య నియంత్రణకు పెద్దపీట వేసినట్లు వివరించారు. కార్యకర్తలు కేసులకు భయపడాల్సిన అవసరం లేదని.. ఓపికతో ముందుకు సాగాలని సూచించారు. ప్రజల తరపున పోరాటాల్లో భాగస్వాములు కావాలని కోరిన జగన్ మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే అంటూ ధీమా వ్యక్తం చేశారు












Click it and Unblock the Notifications