చంద్రబాబుకు భారీ షాకిచ్చిన జగన్.. వైసీపీలోకి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో వైసిపి ఓటమి పాలు కావడంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక అప్పటినుంచి ఏపీలో వైసిపి నుండి ఎన్డీఏ కూటమిలోకి వలసలపర్వం ప్రారంభమైంది. అయితే తాజాగా చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి నేడు మాజీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
జగన్ పార్టీలో చేరిన టీడీపీ ముఖ్య నేత
అధికార టిడిపికి షాక్ ఇచ్చి కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు నేడు జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ సీఎం జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి వైసిపి లోకి స్వాగతించారు. ప్రతిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని ముదునూరి మురళీకృష్ణంరాజు ఈ సందర్భంగా వెల్లడించారు.

ఏపీలో వైసీపీలోకి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి చేరిక వెనుక
అయితే అందరూ అధికార పార్టీ వైపు చూస్తున్న క్రమంలో అధికార పార్టీలో ఉన్న నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూసి నేడు ఆ పార్టీలో చేరడం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ముదునూరి మురళీకృష్ణంరాజు ప్రత్తిపాడులో స్థానికంగా ఉన్న పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో టీడీపీ కి గుడ్ బై చెప్పారని తెలుస్తుంది.
గతంలో వైసీపీ నుండి టీడీపీ లోకి ముదునూరి
2023లో ఏప్రిల్ నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరిన ముదునూరి మురళి కృష్ణంరాజు కు తెలుగుదేశం పార్టీ కీలక పదవిని కట్టబెట్టింది, టిడిపి రాష్ట్ర కార్యదర్శిగా, అమలాపురం నియోజకవర్గం టిడిపి పరిశీలకుడిగా ఆయనను నియమించారు. ముదునూరి మురళీకృష్ణంరాజు పార్టీలో చేరినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో విభేదాలు మొదలయ్యాయి. ఆయన రాకను స్వాగతించని ప్రత్తిపాడు నియోజకవర్గ నాయకులు ఆయన పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
పార్టీకి ద్రోహం చేశారని ముదునూరిపై ఆరోపణలు
అంతేకాదు ప్రత్తిపాడు నియోజకవర్గం లో ఎన్నికల సమయంలో మురళీకృష్ణంరాజు తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేశారని, ప్రత్తిపాడు అభ్యర్థి వరుపుల సత్యప్రభ కోసం పనిచేయకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల కోసం ఆయన డబ్బులు పంచారని ఆయన పైన సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి, పార్టీ నుంచి పొందిన పదవులు ఉన్న రద్దు చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు.
చంద్రబాబుకు జగన్ ఊహించని షాక్
ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నేతల తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో తాజా పరిణామాలతో ఆయన టిడిపికి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక వైసీపీలోకి ముదునూరి మురళీ కృష్ణంరాజు చేరికతో, తాజా పరిణామంతో చంద్రబాబుకు జగన్ ఊహించని షాక్ ఇచ్చినట్లయ్యింది.












Click it and Unblock the Notifications