ఏపీ స్కూళ్లలో ఇక ఈ-అటెండెన్స్-టీచర్లకు మొబైల్ యాప్-అందులోనే విద్యార్ధులకూ
ఏపీలో విద్యాసంస్కరణలు చేపడుతున్న వైసీపీ సర్కార్ మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చి, అమ్మఒడితో హాజరుశాతాన్ని పెంచుతున్న సర్కార్.. ఇప్పుడు టీచర్లతో పాటు విద్యార్ధులు కూడా స్కూళ్లకు ఠంచనుగా హాజరయ్యేలా చూసేందుకు యాప్ ల సాయం తీసుకుంటోంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న ఈ యాప్ లు త్వరలోనే పూర్తిస్దాయిలో అమల్లోకి రానున్నాయి.
Recommended Video


ఏపీలో విద్యాసంస్కరణలు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్కూళ్లలో పలు సంస్కరణలకు తెరదీసింది. స్కూళ్ల రూపురేఖలు మార్చేందుకు కోట్ల రూపాయల వ్యయంతో నాడు-నేడు పథకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం.. విద్యార్ధులను భారీగా స్కూళ్లకు రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే అమ్మఒడి పథకాన్ని కూడా అమలు చేస్తోంది.దీంతో పాటు వారి హాజరును కచ్చితంగా నమోదు చేసేందుకు దారులు వెతుకుతోంది. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఢానం సాయం తీసుకుంటోంది.

టీచర్లకు మొబైల్ యాప్ లు
ఏపీ స్కూళ్లలో టీచర్లకు ఇకపై హాజరు నమోదుకు మొబైల్ యాప్ లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగు రకాల యాప్ లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో వీటి ప్రయోగం ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి తూర్పుగోదావరి జిల్లాలో, ఎల్లుండి నుంచి అనంతరపురంలో, ఏప్రిల్ 1 నుంచి ప్రకాశంలో ఈ యాప్ లను ప్రయోగాత్మకంగా పరీక్షించబోతున్నారు. అక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా యాప్ లను అమలు చేస్తారు.

టీచర్లు, విద్యార్ధులకూ ఈ-హాజరు
టీచర్లకు ఇచ్చే మొబైల్ యాప్ ద్వారా టీచర్లతో పాటు విద్యార్ధుల హాజరు కూడా నమోదు చేయబోతున్నారు. ఇప్పటివరకూ మ్యాన్యవల్ గా అటెండెన్స్ రిజిస్టర్ ద్వారా హాజరు నమోదు చేస్తుండగా.. ఇకపై యాప్ ల ద్వారా వీరి హాజరు నమోదు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ యాప్ లను స్కూల్లో ఓపెన్ చేసి హాజరు నమోదు చేస్తేనే నమోదయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా టీచర్లు ఇంటి వద్ద నుంచి హాజరు నమోదు చేయకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. టీచర్లు తమ మొబైల్ ఫోన్ లోని యాప్ ద్వారా విద్యార్ధుల ఫోటోలు తీసి ఓసారి అప్ లోడ్ చేస్తారు. ఆ తర్వాత నుంచి వారిని రోజూ ఫేస్ మాస్కింగ్ ద్వారా హాజరు నమోదు చేస్తారు.

జూన్ నుంచే అమలుకు ఏర్పాట్లు
ప్రస్తుతం వివిధ జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ యాప్ లను అధికారులు పరీక్షిస్తున్నారు. ఇప్పటికే కృష్ణాజిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద దీన్ని అమలు చేస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి అంటే జూన్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ యాప్ ల ద్వారా ఈ-హాజరు నమోదు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తద్వారా టీచర్లు, విద్యార్ధులు సకాలంలో స్కూళ్లకు రావడం, అక్కడ ఎంత సేపు ఉంటున్నారనే అంశాలను గుర్తించబోతోంది. వాటి ఆధారంగానే భవిష్యత్ ప్రణాళికలు రూపుదిద్దుకోబోతున్నాయి.












Click it and Unblock the Notifications