
వాలంటీర్లపై మంత్రి దాడిశెట్టి రాజా అనుచిత వ్యాఖ్యలు-మనం పెట్టిన బచ్చాగాళ్లు-తీసేయండి
ఏపీలో అధికారంలోకి రాగానే వాలంటీర్ల వ్యవస్ధను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వైసీపీ సర్కార్ ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు తమ రాజకీయ అవసరాలకు కూడా వాడుకుంటోంది. ఇదే క్రమంలో వాలంటీర్ల తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. కానీ ఇప్పుడు వైసీపీ మంత్రులు, నేతలు కూడా వారిపై రెచ్చిపోతున్నారు. ఇలాంటిదే ఓ ఘటన తాజాగా కాకినాడ వైసీపీ ప్లీనరీలో చోటుచేసుకుంది.
వాలంటీర్లపై మంత్రి దాడిశెట్టి రాజా
రాష్ట్రంలో వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్ధ ప్రభుత్వంతో పాటు పార్టీ చెప్పుచేతల్లో పనిచేస్తోందన్న విమర్శలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. అలాగే వాలంటీర్లు అన్ని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో స్ధానికంగా వైసీపీ నేతలతో వారికి కొన్నిసార్లు విభేదాలు తప్పడం లేదు. ఇలాంటి నేపథ్యంలోనే కాకినాడలో జరిగిన వైసీపీ ప్లీనరీలో మంత్రి దాడిశెట్టి రాజా వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు మంత్రి వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

వాలంటీర్లు చిన్న బచ్చాగాళ్లు..
కాకినాడ జిల్లాలో వైసీపీ నియమించిన వాలంటీర్లు తమ పార్టీపైనే పెత్తనం చేస్తున్నారని నేతల నుంచి ఆరోపణలు వచ్చాయి. దీనిపై వైసీపీ ప్లీనరీలో మంత్రి దాడిశెట్టి రాజా స్పందించారు. వాలంటీర్లు మనం పెట్టిన చిన్న బచ్చాగాళ్లంటూ ఆయన వ్యాఖ్యానించారు. వాళ్లు.. మనపై పెత్తనం చేస్తున్నారని కార్యకర్తలు అనుకుంటున్నారని రాజా తెలిపారు.దీంతో వైసీపీలోనే వాలంటీర్లపై నెలకొన్న అభిప్రాయం మంత్రి నోటితోనే చెప్పినట్లయింది.

వాలంటీర్లు నచ్చకపోతే తీసేయండి
వాలంటీర్లపై వస్తున్న విమర్శలపై ప్లీనరీలో స్పందించిన మంత్రి దాడిశెట్టి రాజా.. కీలక వ్యాఖ్యలు చేశారు.
వాలంటీర్లను మనమే పెట్టాం.. నచ్చకపోతే తీసేయండి అంటూ నేతలకు సూచించారు. తద్వారా వాలంటీర్లను భరించాల్సిన అవసరం లేదని ఆయన సంకేతాలు ఇచ్చారు. దీంతో నేతలు హుషారుగా చప్పట్లు కొట్టారు. వాలంటీర్లపై స్ధానికంగా వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలోనే మంత్రి దాడిశెట్టి రాజా ఈ వ్యాఖ్యలుచేసినట్లు తెలుస్తోంది. అయితే మంత్రి చేసిన వ్యాఖ్యలు మాత్రం రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి.